Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

ఈడీ విచారణకు నిరసనగా ఆందోళనలు..రాహుల్‌ గాంధీ అరెస్ట్‌

అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ ఇవ్వాళ మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రదర్శనలను నిర్వహించారు. ఆందోళనలకు దిగారు. రోడ్లపై బైఠాయించారు. ర్యాలీలో పాల్గొన్న పలువురు ఎంపీలను ఢల్లీి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనుమతి లేకుండా నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్న కారణంగా అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. విజయ్‌ చౌక్‌ వద్ద రాహుల్‌ గాంధీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. రాహుల్‌ గాంధీని అరెస్ట్‌ కానివ్వకుండా తోటి ఎంపీలు, పార్టీ నాయకులు అడ్డుపడ్డారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్‌ గాంధీని పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల హింసాత్మక రూపు దాల్చాయి. ప్రభుత్వ ఆస్తులపై కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు దాడికి దిగినట్లు వార్తలు అందుతున్నాయి.మరోపక్క దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈడీ విచారణకు హాజరు కావడానికి సోనియా గాంధీ 10, జన్‌పథ్‌ నివాసం నుంచి బయలుదేరిన వెంటనే కాంగ్రెస్‌ నాయకులు రోడ్డెక్కారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పార్లమెంట్‌ సభ్యులు సైతం నిరసన ప్రదర్శనలను చేపట్టారు. పార్లమెంట్‌ భవనం నుంచి ర్యాలీగా విజయ్‌ చౌక్‌కు తరలి వెళ్లారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, రాజ్యసభలో కాంగ్రెస్‌ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గె, రాహుల్‌ గాంధీ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మోడీ కనుసన్నల్లో.. ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పని చేస్త్తున్నాయని మల్లికార్జున ఖర్గె మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా పని చేయాల్సిన దర్యాప్తు ఏజెన్సీలను ప్రధాని మోడీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోన్నారని ధ్వజమెత్తారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఇదివరకు రాహుల్‌ గాంధీని విచారించిన ఈడీ అధికారులు ఏమీ తేల్చలేకపోయారని గుర్తు చేశారు. నిరసన ర్యాలీలతో.. రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలనే లక్ష్యంతో మోడీ.. దర్యాప్తు ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ప్రయోగిస్తోన్నారని మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుందని మండిపడ్డారు. దీనికి నిరసనగా తాము ప్రదర్శనలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తమను ఎంతగా భయపెట్టాలని చూసినా బెదరిపోమని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతామని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img