బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ డిమాండ్
న్యూదిల్లీ : రైతు సమస్యలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ శుక్రవారం దునుమాడారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ కేంద్రాలు పూర్తిగా అవినీతి కేంద్రాలుగా మారాయని మండిపడ్డారు. ధాన్యాన్ని రైతులు బలవంతంగా మధ్యవర్తులకు అమ్ముకునే పరిస్థితి కల్పించారని ఆరోపించారు. ధాన్యం కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టపరమైన హామీ ఇవ్వాలని వరుణ్‌గాంధీ డిమాండు చేశారు. మూడు సాగు చట్టాలు రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లలో ఇది కూడా ఒకటని తెలిపారు. మండీలలో రైతులను నిత్యం మోసగిస్తున్నారని, ఇది ఎల్లకాలం సాగదని హెచ్చరించారు. మండీలలో మధ్యవర్తులు, అధికారులు కుమ్మక్కై రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని, మండీలలో కొనసాగుతున్న అక్రమాలపై కఠినచర్యలు తీసుకోవాలని వరుణ్‌గాంధీ విజ్ఞప్తి చేశారు. బరేలీలోని ఓ మండీలో ప్రభుత్వ అధికారితో తాను మాట్లాడిన వీడియోను వరుణ్ పోస్టు చేశారు. తాము ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందులను రైతులు వరుణ్ వద్ద ప్రస్తావించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఘోర అవమానమని వ్యాఖ్యానించారు. అధికారులు, మధ్యవర్తులు లాలూచీ పడి తక్కువ ధరకు పంట ఉత్పత్తులు అమ్ముకునేలా రైతులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపించారు. ఇలాంటి దారుణాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయని ఆగ్రహం వెలిబుచ్చారు. అధికారులే స్వయంగా రైతులను భయపెడుతున్నారని, తక్కువ ధరకు ధాన్యం విక్రయించాలని ఒత్తిడి చేస్తున్నారని, ఈ అంశాలపై కోర్టులను ఆశ్రయించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకునేలా చేస్తామని వరుణ్ వివరించారు. రాష్ట్రంలోని ప్రతి సేకరణ కేంద్రంలో అవినీతి విలయతాండవం చేస్తోందన్నారు. ఇదంతా బహిర్గతమేనన్నారు.