రైతులకు కేంద్రం ద్రోహం
నాణ్యత పేరుతో ఎఫ్‌సీఐ నాటకం
అన్నదాతల ఆగ్రహం
భోపాల్ : నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేశారన్న ఆనందాన్ని ఆస్వాదించకుండానే ఆహార ధాన్యాల సేకరణకు సంబంధించి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై కేంద్రం దోబూచులాడుతోంది. రైతులకు ద్రోహం చేసింది. ఎంఎస్‌పీకి సంబంధించి ఇటీవల చేసిన ప్రతిపాదనపై ఇటు రైతులు, అటు ప్రతిపక్షాలు.. మోదీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఆహార ధాన్యాల సేకరణకు సంబంధించిన నాణ్యత నిబంధనలు మార్చేందుకు ముసాయిదాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) విడుదల చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఆహార నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు అవసరమని ఆ ముసాయిదా ద్వారా చెప్పేందుకు ఎఫ్‌సీఐ ప్రయత్నిస్తోంది. ప్రజలకు నాణ్యత ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు, దీర్ఘకాలంగా నిల్వ చేసేందుకు ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఆహార ధాన్యాల కోసమే ఈ ముసాయిదా అని ఎఫ్‌సీఐ చెబుతోంది. తన చర్యను కేంద్రం నిస్సిగ్గుగా సమర్థించుకుంటోంది. సేకరించిన ఆహార ధాన్యాల నాణ్యతా ప్రమాణాలను సమీక్షించడానికి, ప్రపంచ ప్రమాణాలతో బెంచ్‌మార్క్ ఏర్పాటు చేయడానికి ఎఫ్‌సీఐ చైర్మన్ అధక్షతన గత నెల 31న సమావేశం జరిగింది. వాస్తవంగా ఇటువంటి కఠిన నిబంధనల ద్వారా ఎంఎస్‌పీని రైతులకు అందకుండా కేంద్రం చేపడుతున్న ఓ ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. కొనుగోళ్లు లేకుండా చేయడం, ఎంఎస్‌పీని తగ్గించేందుకు మోదీ సర్కార్ ఇటువంటి ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ విరుచుకుపడుతోంది.
ప్రతిపాదన ముసాయిదా ప్రకారం గోధుమలో తేమ శాతాన్ని 14 నుంచి 12 శాతానికి తగ్గిస్తూ ప్రతిపాదించారు. మట్టి బెడ్డలతో కూడిన గోధుమల పరిమితి గతంలో 0.75శాతం ఉండగా ఇప్పుడు 0.50 శాతానికి తగ్గించారు. కొద్దిగా దెబ్బతిన్న గోధుమలను 4 శాతం నుంచి 2 శాతానికి, విరిగిన గోధుమ గింజలకు 6 శాతం నుంచి 4 శాతానికి పరిమితం చేశారు. వరి విషయంలో చూస్తే.. అనుమతించదగిన తేమను 17 శాతం నుంచి16 శాతానికి పరిమితం చేశారు. మట్టి, మలినాలతో కూడిన వరికి 2 శాతం నుంచి 1 శాతానికి, తక్కువగా దెబ్బతిన్న, రంగు మారిన గింజలకు 5 శాతం నుంచి 3 శాతానికి, విరిగిన బియ్యం శాతాన్ని 25 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. బియ్యంలో తేమ శాతాన్ని 15 నుంచి 14 శాతానికి కోత పెట్టింది. దెబ్బతిన్న బియ్యం పరిమితిని ఒక శాతానికి తగ్గించింది. ఎర్రబారిన ధాన్యాలను కొనుగోలు చేయదు. దీనిపై మాట్లాడేందుకు ఓ పాత్రికేయుడు కరోండ్ మండిని సందర్శించగా అక్కడ రైతులు ఉదయం 9 గంటలకు చేరుకొని పడిగాపులు పడుతున్నారు. మండి అధికారులు మాత్రం 12 గంటల తర్వాత వచ్చారు. ఈ ప్రతిపాదనలపై అక్కడి రైతులను ప్రశ్నించగా.. దీనివల్ల తమకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆగ్రహం వెలిబుచ్చారు. తేమ వల్ల ఆహార్య ధాన్యాల ధరలు తగ్గుతాయని, ఆ తేమ శాతం తమ చేతుల్లో లేదని తెలిసినా ఇటువంటి చర్యలకు దిగడం అనైతికమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంట వేసింది మొదలు…వాటిని అమ్మేంత వరకు ప్రతిచోటా బారులుతీరి వరుసలో నిలబడాల్సి వస్తోందని కిశోర్ మీనా అనే రైతు తెలిపారు. ఈ ముసాయిదాపై కాంగ్రెస్, ఇతరులు మండిపడుతున్నారు. ఆహార ధాన్యాల కొనుగోలు నుంచి తప్పుకునేందుకు ఎఫ్‌సీఐ ఇటువంటి చర్యలకు దిగుతోందని విమర్శించారు. మధ్యప్రదేశ్ వ్యవసాయ సలహామండలి మాజీ సభ్యులు కేదర్ సిరోహి మాట్లాడుతూ ఎంఎస్‌పీకి స్వస్తి పలికేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఆహార ధాన్యాల సేకరణ నిబంధనలను కఠినతరం చేస్తూ దిగుమతులను సడలిస్తోందని విమర్శించారు.