Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

కాంగ్రెస్‌లో రావత్‌ మంటలు

అధిష్ఠానంపై తాడోపేడో
నేడు దిల్లీకి హరీశ్‌, రాష్ట్ర నేతలు
మాజీ సీఎంకు ఉత్తరాఖండ్‌ నాయకుల అండ

డెహ్రాడూన్‌ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ రాజకీయాలు వేడెక్కాయి. అంతర్గత కలహాలతో రోడ్డెక్కింది. పార్టీ అధిష్ఠానంతోనూ, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల మధ్య పొసగడం లేదు. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ సీఎం హరీశ్‌ రావత్‌ అధిష్ఠానంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కాంగ్రెస్‌ పెద్దలపై పరీక్ష ఆరోపణలు చేశారు. రావత్‌తో వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర నాయకులు కొంతమంది వంతపాడారు. కాంగ్రెస్‌ పార్టీలో అలజడి సృష్టించిన రావత్‌…తాజాగా మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బహిర్గతపరుస్తానని బాంబు పేల్చారు. ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గనేశ్‌ గొడియాల్‌ సైతం పార్టీ తనకు సహకరించడం లేదని ఆరోపించారు. రావత్‌ వ్యాఖ్యలను సమర్ధిస్తూ మాట్లాడారు. పార్టీ వ్యవహారాలపై తన అంసతృప్తిని వెల్లడిరచారు. పార్టీ అధిష్ఠానంతో చర్చించి ఒకటి, రెండు రోజుల్లో సమస్య పరిష్కరించుకుంటానని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు శుక్రవారం దిల్లీ వెళ్లి కేంద్ర నాయకులుతో సమావేశమవుతారని ఆయన చెప్పారు. హరీశ్‌ రావత్‌ విలేకరులతో మాట్లాడుతూ సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు మీతో పంచుకుటానని, మీతో కాకపోతే ఇంకెవరితో చెబుతానని అన్నారు. ఆ సందర్భం వచ్చినప్పుడు స్వయంగా తానే పిలిచి అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు. అప్పటి వరకు ప్రస్తుత పరిణామాలను ఆస్వాదించండని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీకి మరింత తలనొప్పి తెచ్చిపెట్టాయి. రావత్‌ పార్టీ నుంచి బయటికెళతారా లేక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారా అని సంశయంలో పడిపోయింది. వాస్తవంగా రావత్‌ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అయినా…పార్టీలో తనకు కాళ్లు, చేతులు కట్టేసినట్లు ఉందని, ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రావత్‌ ట్వీట్‌ చేశారు. తన భవిష్యత్‌ కార్యాచరణపై నూతన సంవత్సరంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో అప్రమత్తమైన పార్టీ అధిష్ఠానం..రావత్‌ సహా ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ పక్ష నేత ప్రీతమ్‌సింగ్‌ను దిల్లీకి ఆహ్వానించింది. వారిద్దరు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీతో భేటీ అవుతారు.
రావత్‌ వ్యాఖ్యలను పీసీసీ అధ్యక్షుడు గోడియాల్‌ సమర్థిస్తూ తనకూ పార్టీ సహకరించడం లేదన్నారు. ఈ పరిస్థితి ఇప్పటిది కాదని, ఎప్పటి నుంచో ఇది కొనసాగుతోందని ఆయన ఆవేదన చెందారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో తాము సమావేశమవుతామని, అవసరమైతే రాహుల్‌గాంధీతోనూ భేటీ అవుతామని, దీంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భావిస్తున్నానన్నారు. హరీశ్‌ రావత్‌ రాష్ట్రంలో పెద్ద నాయకుడు, ఆయన ప్రజల హృదయాల్లో నిలిచారు. అయినా, ఆయన పట్ల అధిష్ఠానం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు లేవని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ మొత్తం హరీశ్‌ రావత్‌తోనే ఉంటుందన్నారు. ఉత్తరాఖండ్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జితో రావత్‌కు వైరుధ్యాలు ఉన్నాయా అని అడుగగా గొడియాల్‌ నేరుగా సమాధానం చెప్పడానికి ఆసక్తి చూపలేదు. అయితే అందరినీ కలుపుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత ఇన్‌చార్జికి ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img