కారులోంచి కళ్లు తిరిగి పడబోయిన సిద్ధరామయ్య.. పట్టుకున్న అంగరక్షకులు, కార్యకర్తలు.. వీడియో
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇవాళ కారు ఎక్కుతుండగా కళ్లు తిరిగి వెనక్కి పడబోయాడు. డ్రైవర్ పక్కన సీటు వైపు నుంచి కారులోకి ఎక్కుతూ సిద్ధరామయ్య రెండు కాళ్లు లోపలపెట్టి నిలబడ్డారు. కారు చుట్టూ ఉన్న కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం కారు లోపల కూర్చోబోతూ ఒక్కసారిగా వెనక్కి తూలాడు. అక్కడే ఉన్న సిద్ధరామయ్య అంగరక్షకులు, కార్యకర్తలు అది గమనించి వెంటనే కింద పడకుండా పట్టుకున్నారు. కారులో కూర్చోబెట్టి చల్లటి మంచినీళ్లు తాగించారు. అనంతరం సిద్ధరామయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన ట్విటర్‌లో తనకు ఏం కాలేదని, కారులో కూర్చోబోయి వెనక్కి తూలానని పేర్కొన్నారు. విజయనగర జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.