ముంబై: బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలున్నా అవి అమలుకు నోచుకోవడం లేదని తాజాగా మహారాష్ట్రలో జరిగిన సర్వేలో తేలింది. మెల్ఘుట్లో కొన్ని జిల్లాల్లో పోషకాహార లోపంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణలో భాగంగా న్యాయవాది అశుతోష్ కుంభకోని బాంబే హైకోర్టుకు సమర్పించిన నివేదికలో నివ్వెరపోయే గణాంకాలు బయటపడ్డాయి. గడిచిన మూడేళ్లలో గిరిజనులు అధికంగా ఉండే పదహారు జిల్లాల్లో 15,253 బాల్య వివాహాలు జరిగాయి. 6,582 మంది పిల్లలు పోషకాహార లోపంతో మరణించారని ఆ నివేదికలో పేర్కొన్నారు. 601 కేసుల్లో తల్లిదండ్రులవి బాల్యవివాహాలుగా తేలాయి. ఈ విషయంలో కోర్టు స్పందిస్తూ ‘ఈ గణాంకాలు పరిశీలిస్తున్నప్పుడు మనసు చలించిపోయింది. ఆదివాసీలు ఎక్కువగా ఉండే చోట అధిక సంఖ్యలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఆ వర్గంలోని పెద్దలకు వీటిపై అవగాహన కల్పించండి. బాల్య వివాహాల ప్రభావం, పిల్లల హక్కుల ఉల్లంఘనలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రభుత్వానికి అవసరం.’ అని పేర్కొంది.