Monday, February 6, 2023
Monday, February 6, 2023

గుజరాత్‌లో అధికార మార్పు

రూపానీకి తప్పించి పటేల్‌కు పగ్గాలిచ్చిన బీజేపీ
కోవిడ్‌ కట్టడిలో వైఫ్యలమే కారణం

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ రాజకీయ పరిణామాలు ఈ ఏడాది చర్చనీయంశాల్లో నిలిచాయి. ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానీని తప్పించి ఆయన స్థానంలో భూపేంద్ర పటేల్‌కు సీఎం బాధ్యతలను బీజేపీ కట్టబెట్టింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పటేల్‌కు అధికారులు ఇవ్వడంపై సర్వత్రా చర్చ జరిగింది. అయితే కోవిడ్‌ రెండవ దశ నియంత్రణలో వైఫల్యం కారణంగానే రూపానీ పదవిని కోల్పోయారని రాజకీయ పరిశీలకులు అన్నారు. రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 17వ ముఖ్యమంత్రిగా పటేల్‌ సెప్టెంబరులో ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపాలిటీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగిన నేగా పేరుగాంచారు. ఈయన కోసం నితిన్‌ పటేల్‌, భూపేంద్ర సిన్హా చుదాసమా, కౌశిక్‌ పటేల్‌, ప్రదీప్‌ సిన్హా జడేజా వంటి సీనియర్లను సైతం బీజేపీ అధిష్ఠానం పక్కకుపెట్టేసింది. ఈ సీనియర్లు అంతా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేసిన వారే. కోవిడ్‌19 రెండవ దశలో మరణాలను రాష్ట్ర ప్రభుత్వం తక్కువగా చూపిందని విపక్షాలు ఆరోపించాయి. అనేక మంది ఆసుపత్రుల్లో పడకల కొరత, ఆక్సిజన్‌ లేక అనేకమంది ఇళ్ల వద్దనే ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నాయి. అంతిమ సంస్కారాలు జరిపించేందుకు మృతుల బంధువులు గంటల తరబడి శ్మశానాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఏడాది చివరిలో కోవిడ్‌ మరణాలను తక్కువగానే రాష్ట్ర ప్రభుత్వం చూపిందని ఆరోపణలు వచ్చాయి. అధికారికంగా నమోదు అయిన వాటి కంటే రెట్టింపు మరణాలకు రూ.50వేలు చొప్పున పరిహారం ఇచ్చినట్లు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మహాత్మాగాంధీ స్థాపించిన సబర్మతీ ఆశ్రమం పునరాభివృద్ధి, బలవంతపు మతమార్పిడి, పెళ్లిళ్లు జరిపించడం, వీధుల్లో మాంసాహార విక్రయాలపై ఆంక్షలు వంటి అంశాలతో ఈ ఏడాది మొత్తం రాజకీయ నేతలు, కార్యకర్తలు బిజీ అయ్యారు. కోవిడ్‌19 ఒక్కటే కాదు తౌక్టే తుపాను కారణంగా గుజరాత్‌ అతలాకుతలమైంది. మేలో సంభవించిన ఈ విపత్తు 79 మంది ప్రాణాలు తీసింది. విధ్వంసాన్ని మిగిల్చింది. డయ్యూ వద్ద తీరం దాటిన తుపాను పెనువిపత్తుగా పరిణమించింది. ఆగస్టు నాటికి ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పదవీకాలాన్ని రూపానీ పూర్తి చేసుకోగా సెప్టెంబరు 11న రాజీనామా చేశారు. అందరు ఆశ్చర్యపోయే విధంగా మరుసటి రోజు పటేల్‌ బీజేపీ శాసనసభపక్ష నేతగా ఎన్నికయ్యారు. 1960లో రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి అత్యున్నత స్థానాన్ని పాటిదార్లే ఉండగా అదే వర్గానికి చెందిన ఐదవ నేతగా పటేల్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధీష్టించారు. ఆ సామాజిక వర్గం ప్రాబల్యం మరోమారు స్పష్టమైంది. పాటిదార్‌ కోటా ఉద్యమం తర్వాతే 2017లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1995 నుంచి రాష్ట్రంలో బీజేపీ విజయకేతనాన్ని ఎగరవేస్తూ వచ్చింది. నవంబరులో రాజ్‌కోట్‌, వడోదరా, అహ్మదాబాద్‌ పౌర సంఘాలన్నీ బీజేపీ పరిధిలోనివే కాగా అక్కడ వీధిబండ్లపై మాంసాహారాన్ని అమ్మడంపై ఆంక్షలు విధించాయి. వీధివిక్రేతల పిటిషన్‌పై గుజరాత్‌ హైకోర్టు స్పందిస్తూ స్థానిక యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు మాంసాహారం ఇష్టం లేకపోతే అది మీ సమస్య, ఎవ్వరూ తినకూడదని మీరు ఎలా చెబుతారు? ఎవరికి ఇష్టమైనది వారు తినకుండా ఎలా అడ్డుకుంటారు? అంటూ అసహనం వ్యక్తం చేశారు. గుజరాత్‌ మతస్వేచ్ఛ (సవరణ) చట్టం, 2021 వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి ఆరు నిబంధనలపై గుజరాత్‌ హైకోర్టు స్టే విధించింది. ఈ ఏడాది గుజరాత్‌లోని ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లను బీజేపీ గెలిచింది. 31 జిల్లా పంచాయతీలు, 231కిగాను 196 తాలూకా పంజాయతీలు, 81కుగాను 74 మున్సిపాలిటీలను ఫిబ్రవరి ఎన్నికల్లో గెలిచింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆమ్‌) సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 120కుగాను 27 స్థానాలను కైవసం చేసుకుంది. వచ్చే ఏడాది రాష్ట్ర ఎన్నికలు 182 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామని కేజ్రీవాల్‌ ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా అమిత్‌చావ్డా స్థానాన్ని ఓబీసీ నేత జగదీశ్‌ ఠాకూర్‌ భర్తీ చేశారు. గిరిజన నేత సుఖ్‌రామ్‌ రఠ్వా స్థానంలో పరేశ్‌ ధనావీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img