జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరేతోయిబా, రెసిస్టెన్స్ ఫ్రంట్ విభాగాలకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని జకురా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని ఇఖ్లాక్ హజామ్‌గా గుర్తించారు. ఇటీవల అనంత్‌నాగ్‌లోని హసన్‌పోరాలో హెడ్ కానిస్టేబుల్ అలీ మహమ్మద్ ఘనీని హతమార్చడంలో ఈ ఉగ్రవాది ప్రమేయం ఉన్నట్లు శ్రీనగర్ పోలీసులు తెలిపారు. 2 పిస్టల్స్ సహా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ ఐజిపి తెలిపారు.