Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

టీఎంసీలో చేరిన బీజేపీ ఎంపీ బాబుల్‌ సుప్రియో


` బెంగాల్‌ అభివృద్ధి కోసం పని చేస్తానని వెల్లడి
న్యూదిల్లీ : బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో శనివారం కోల్‌కతాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ)లో చేరారు. ‘ఈరోజు, పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ, రాజ్యసభ ఎంపీ డెరిక్‌ ఒబ్రెయిన్‌ సమక్షంలో కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్‌ ఎంపీ బాబుల్‌ సుప్రియో తృణమూల్‌ కుటుంబంలో చేరారు’ అని పార్టీ ఒక ట్వీట్‌లో తెలిపింది. గత నెలలో తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు సుప్రియో ప్రకటించారు. కానీ తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఆయనను ఒప్పించారు. బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాతో సమావేశం అనంతరం అసన్‌సోల్‌ ఎంపీ విలేకరులతో మాట్లాడుతూ ఒక పార్లమెంటేరియన్‌గా తన రాజ్యాంగ బాధ్యతలను కొనసాగిస్తానని చెప్పారు. ఇదిలాఉండగా, ఇక్కడ టీఎంసీలో చేరిన తర్వాత సుప్రియో మాట్లాడుతూ మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీలో చేరేందుకు తాను అత్యంత ఉత్సాహంతో ఉన్నానని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధి కోసం పని చేస్తానని అన్నారు. అసన్‌సోల్‌ నుంచి బీజేపీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా, తాను రూల్‌ బుక్‌ను అనుసరిస్తానని చెప్పారు. ‘రాజకీయాల నుంచి వైదొలుగుతానని రెండు నెలల క్రితం నేను చెప్పాను. అయితే కొత్త అవకాశం వచ్చిన తర్వాత నా మనస్సు మారింది. టీఎంసీలో చేరడం గురించి అత్యంత ఉత్సాహంగా ఉన్నాను. బెంగాల్‌ అభివృద్ధి కోసం పని చేయాలనుకుంటున్నాను’ అని తెలిపారు. సోమవారం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం అవుతానని కూడా సుప్రియో వివరించారు. ‘రాష్ట్రం కోసం పని చేసేందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మమతా బెనర్జీ, అభిషేక్‌ బెనర్జీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img