Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

డిజిటల్‌కు గ్రీన్‌సిగ్నల్‌

డిజిటల్‌ రూపీ.. 5జీ టెక్నాలజీ.. అన్నీ ఈ ఏడాదే
సాంకేతికతకు కేంద్రం దన్ను

న్యూదిల్లీ: దేశాన్ని ‘డిజిటల్‌ ఇండియా’గా తీర్చిదిద్దేందుకు కేంద్రం నడుంబిగించింది. ఈసారి బడ్జెట్‌లో సాంకేతికతపై ప్రత్యేక దృష్టిసారించింది. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా డిజిటల్‌ కరెన్సీని తీసుకురానుంది. ఈ ఏడాదిలోనే డిజిటల్‌ రూపీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ 2022-23 ప్రసంగంలో ప్రకటించారు. ఇక దీంతో పాటు 5జీ టెక్నాలజీని కూడా రానున్న ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడిరచారు. డిజిటల్‌ చెల్లింపులు, డిజిటల్‌ బ్యాంకింగ్‌కు ఈ ఏడాది కూడా మరింత ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపారు.
డిజిటల్‌ రూపీ
దేశ ఆర్థిక వ్యవస్థ, సమర్థవంతమైన నగదు నిర్వహణను బలోపేతం చేసేలా 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టనున్నాం. బ్లాక్‌చైన్‌, ఇతర సాంకేతికతలతో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిజిటల్‌ రూపీని జారీ చేయనుంది
5జీకి వేళాయే..
టెలీకమ్యూనికేషన్‌, 5జీ టెక్నాలజీ వల్ల ఆర్థిక వృద్ధితో పాటు ఉద్యోగాల సృష్టి మెరుగ్గా ఉంటుంది. అందుకే, 2022-23లో దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులో తీసుకొస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఇందుకోసం 2022లో స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహించనున్నట్టు పేర్కొంది. ప్రైవేటు టెక్నాలజీ సంస్థల ద్వారా ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టబోతున్న తెలిపింది. అంతేగాక, 5జీ టెక్నాలజీకి బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు సరికొత్త పథకం తీసుకురానున్నామనీ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంలో భాగంగా ఈ స్కీంను తీసుకొస్తామని ఆర్ధికమంత్రి వివరించారు.
గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్‌ వనరులు..
పట్టణ ప్రాంతాల్లోని ప్రజల మాదరిగా గ్రామీణ ప్రాంత వాసులకు కూడా ఈ-సేవలు, కమ్యూనికేషన్‌ సదుపాయాలు, డిజిటల్‌ వనరులను అందించడంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. భారత్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో ఆప్టికల్‌ ఫైబర్‌లు ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టులు ఇవ్వనున్నది. ఈ కాంట్రాక్టులు 2025 నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో బ్రాడ్‌బ్యాండ్‌, మొబైల్‌ సర్వీసులు అందించేందుకు యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ వార్షిక వసూళ్లలో ఐదుశాతం నిధులను కేటాయించనున్నట్టు తెలిపింది.
డిజిటల్‌ బ్యాంకింగ్‌..
ఇటీవలి కాలంలో దేశంలో డిజిటల్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ చెల్లింపులు, ఫిన్‌టెక్‌ ఇన్నోవేషన్‌ వేగంగా విస్తరించింది. ఈ రంగాలకు ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. దేశానికి స్వాత్రంత్యం వచ్చి ఈ ఏడాదితో 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల ద్వారా 75 జిల్లాల్లో 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.
డిజిటల్‌ చెల్లింపులకు ప్రోత్సాహం
దేశవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు 2021-22 బడ్జెట్‌లో రూ.1500 కోట్లతో ప్రత్యేక నిధులు కేటాయించారు. ఈ ప్రోత్సాహాలు 2022-23 బడ్జెట్‌లోనూ కొనసాగుతాయి. దీని ద్వారా డిజిటల్‌ చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉంది.
యానిమేషన్‌కు టాస్క్‌ఫోర్స్‌
యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌ అండ్‌ కామిక్‌ రంగంతో ఎంతోమంది యువత ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img