Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు

కర్ణాటక ఏసీబీ సోదాల్లో బయటపడిన వైనం
అవినీతి అధికారుల నివాసాలపై విస్తృత దాడులు

బెంగళూరు : కర్ణాటకలో అవినీతి ప్రభుత్వ ఉద్యోగులకు షాకిస్తూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అనూహ్య రీతిలో దాడులు చేసింది. ఒకేసారి 60 చోట్ల విస్తృత సోదాలు నిర్వహించారు. భారీ మొత్తంలో అక్రమ బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా ఏసీబీ అధికారులు కలబురగి పీడబ్ల్యూడీ జేఈ శాంతగౌడ ఇంట్లో తనిఖీ కోసం వెళ్లారు. అతని ఇంటి డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు ఉన్నట్లు గుర్తించారు. ప్లంబర్‌ను పిలిపించి పైపు కట్‌ చేసి వాటిని బయటకు తీశారు. ఏసీబీ అధికారులను చూసి శాంతగౌడ తలుపులు 10 నిమిషాల పాటు తెరవలేదు. ఆ సమయంలోనే అతను డబ్బును డ్రైనేజీ పైపులో వేసి ఉంటాడని అధికారులు చెప్పారు. ఈ విషయం తెలిసే తాము పైపు కత్తిరించినట్లు వివరించారు. శాంతగౌడ ఇంట్లో రూ.40లక్షల అక్రమ నగదు, బంగారు ఆభరణాలను అధికారులు సీజ్‌ చేశారు. బెంగళూరు, మంగళూరు, మాండ్యా, బళ్లారిల్లోని వివిధ శాఖలకు చెందిన 15మంది అధికారుల కార్యాలయాలపై 400మంది అవినీతి నిరోధకశాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. 15మంది అధికారులకు వ్యతిరేకంగా నమోదైన అక్రమాస్తుల కేసుల విచారణలో భాగంగా బుధవారం 8 మంది ఎస్పీలు, 100 మంది అధికారులు, 300 మంది సిబ్బందితో ఏకకాలంలో దాడులు చేశామని అవినీతి నిరోధకశాఖ తెలిపింది. మంగళూరు స్మార్ట్‌ సిటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కేఎస్‌ లింగగౌడ, మాండ్య ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కె.శ్రీనివాస్‌, దొడ్డబళ్లాపుర రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనరసింహయ్య, బెంగళూరు నిర్మితి కేంద్ర వాసుదేవ్‌ ప్రాజెక్టు మాజీ మేనేజర్‌, బెంగళూరు నందనీ డెయిరీ జనరల్‌ మేనేజర్‌ బి.కృష్ణారెడ్డి, గడగ్‌ అగ్రికల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ టీఎస్‌ రుద్రేషప్ప, బైలహోనగళ కో`ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ ఏకే మస్తీ తదితర అధికారులనివాసాలలో తనిఖీలు జరిగాయి. గడగ్‌ జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ టీఎస్‌ రుద్రేషప్పకు చెందిన శివమొగ్గ నివాసంలో రూ.3.5కోట్లు విలువ చేసే 7.5 కేజీల బంగారాన్ని సీజ్‌ చేశారు. రూ.15లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇంట్లో చేసిన సోదాల్లో 100 గ్రాముల గోల్డ్‌ బిస్కట్లు 60, 50 గ్రాములవి 8, కిలోన్నర ఆభరణాలు, డైమండ్‌ నెక్లెస్‌, 3 కేజీల వెండిని అధికారులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img