పెరంబూర్(చెన్నై): తమిళనాడులో 21 కార్పొరేషన్లు, 138 మున్సిపాలిటీలు, 489 పట్టణ పంచాయతీలకు ఈ నెల 19వ తేదీ ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు గురువారం సాయంత్రం 6 గంటల్లోపు ప్రచారాన్ని ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమిగాను, ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీ, మక్కల్ నీది మయ్యం, పీఎంకే, నామ్ తమిళర్ కట్చి సహా వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఎన్నికలకు నాలుగు రోజులే వ్యవధి ఉండడంతో అభ్యర్థులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. తొలుత ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ప్రచారానికి అనుమతించిన ఈసీ, అభ్యర్థుల కోరిన మీదట ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటలకు వరకు ప్రచార సమయాన్ని పొడిగించింది. ఈ నేపథ్యంలో, ఎన్నికలకు 48 గంటల ముందుగా ప్రచారం నిలిపివేయాల్సి ఉంది. ఆ ప్రకారం గురువారం సాయంత్రం 6 గంటల్లోపు ప్రచారాలు ముగించాలని, సమయం ముగిసిన తర్వాత సభలు, ఇంటింటి ప్రచారం, రోడ్‌షోలు చేపడితే చట్టపరమైన చర్యలు చేపడతామని ఈసీ హెచ్చరించింది. పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి 268 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. ఇందుకు గాను ఆయా కేంద్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 19న జరిగే పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను లెక్కింపు కేంద్రాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించనున్నారు. అనంతరం 22వ తేదీ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్ణ్టల్ ఓట్లను లెక్కించనున్నారు.