హైకోర్టుకు కర్ణాటక ప్రభుత్వ వివరణ
ప్రైవేటు విద్యాసంస్థల్లో యూనిఫాం కోడ్‌పై జోక్యం ఉండదని వెల్లడి
బెంగళూరు: తరగతి గదులు మినహా పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై ఎటువంటి ఆంక్షలు లేవని కర్ణాటక ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు తెలియజేసింది. తరగతులు జరిగే సమయంలో మాత్రమే యూనిఫాంను తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. హిజాబ్ వివాదంపై దాఖలైన పిటిషన్లపై ఎనిమిదో రోజు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ వాదనలు వినిపించారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 19 ప్రకారం హిజాబ్ ధరించే హక్కు ఉందని, ఈ హక్కుపై అధికరణ 19(2) ప్రకారం ఆంక్షలు విధించవచ్చునని తెలిపారు. ప్రస్తుత కేసులో విద్యా సంస్థల లోపల సహేతుక ఆంక్షలను రూల్ 11 విధిస్తోందని చెప్పారు. ఇది సంస్థాగత క్రమశిక్షణకు లోబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ ఫరూఖీ తీర్పును ప్రస్తావించారు. ఇస్లాం మతాన్ని ఆచరించేందుకు మసీదు ముఖ్యమైనది కాదని, నమాజ్‌ను ఎక్కడైనా చేయవచ్చునని, ఆరుబయట కూడా నమాజ్ చేయవచ్చునని ఈ తీర్పులో చెప్పారని తెలిపారు. అయితే దీనిని రాజ్యాంగం నిషేధించలేదన్నారు. విద్యా సంస్థల ప్రాంగణాల్లో హిజాబ్‌ను ధరించడంపై ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. తరగతి గదుల్లో బోధన జరిగే సమయంలో మాత్రమే హిజాబ్ ధరించడంపై ఆంక్షలు ఉన్నాయన్నారు. ఈ కేసులో సంక్లిష్టతను వివరిస్తూ, ఒకవేళ హిజాబ్‌కు మతపరమైన అనుమతిని ఇస్తే, వెనువెంటనే ఆ మతాన్ని ఆచరించే మహిళలు హిజాబ్ ధరించాలనే నిర్బంధానికి గురవుతారన్నారు. నచ్చినదానిని ధరించడానికి అవకాశం ఉండదన్నారు. మానవ గౌరవ, మర్యాదలలో స్వేచ్ఛ ఇమిడియుంటుందని, ధరించడానికి, మానేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. నిర్బంధం విధించాలని పిటిషనర్ కోరుతున్నారని, ఇది రాజ్యాంగ విలువలకు విరుద్ధమని చెప్పారు. దీనిని తప్పనిసరి చేయకూడదన్నారు. సంబంధిత మహిళల ఇష్టానికి వదిలిపెట్టాలన్నారు. మతం ఆధారంగా ఎటువంటి వివక్ష ఉండకూడదని, ప్రైవేటు అన్‌ఎయిడెడ్ మైనారిటీ సంస్థల విషయానికొస్తే, వాటిలో యూనిఫాం కోడ్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని, నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఆయా సంస్థలకే వదిలిపెడుతోందని చెప్పారు.
హిజాబ్ పిటిషనర్ సోదరుడిపై దాడి
హిజాబ్ కేసులో పిటిషనర్ సోదరుడిపై సంఫ్‌ు పరివార్ కార్యకర్తలు దాడి చేసిన ఘటన ఉడుపిలో చోటుచేసుకుంది. హిజాబ్ నిషేధం కేసులో పిటిషనర్లలో ఒకరైన ఉడుపికి చెందిన విద్యార్థిని హజ్రా షిఫా… తన సోదరుడిపై అల్లరి మూక దాడి చేసిందని ఆరోపించారు. హిజాబ్ ధరించడాన్ని కొనసాగించాలనే తన నిర్ణయానికి హింసను ముడిపెట్టారని హజ్రా షిఫా పేర్కొన్నారు. హజ్రా షిఫా కుటుంబ సభ్యులు మల్ఫేలో బిస్మిల్లా రెస్టారెంట్‌ను నడుపుతున్నారు. అక్కడ సోమవారం రాత్రి తన సోదరుడు సైఫ్‌పై దాడి జరిగిందని, రెస్టారెంట్ విండోలను కూడా ధ్వంసం చేశారని తెలిపారు. ‘నా సోదరుడిపై ఒక గుంపు దారుణంగా దాడి చేసింది.. నా హక్కు అయిన హిజాబ్ కోసం నేను నిలబడినందున, మా ఆస్తి కూడా నాశనం చేశారు.. నా సోదరుడిపై దాడి చేసిన సంఫ్‌ు పరివార్ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని ఉడుపి పోలీసులను ట్యాగ్ చేస్తూ హజ్రా షిఫా సోమవారం అర్ధరాత్రి ట్వీట్ చేశారు. ఈ ఘటనపై మల్ఫే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.