Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

దద్దరిల్లిన రాజ్యసభ

వెల్‌లో ప్రతిపక్షాల నిరసన
12 మంది ఎంపీల సస్పెన్షన్‌ ఎత్తివేతకు డిమాండు
గందరగోళం నడుమ కార్యకలాపాలు
మీరు నన్ను శాసించలేరు.. : సభాపతి

న్యూదిల్లీ : పార్లమెంటు సమావేశాల నుంచి 12 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసిన వివాదం సర్దుమణగడం లేదు. చిలికిచిలికి గాలివానగా మారుతోంది. ప్రతిరోజు ఇదే అంశంపై చట్టసభలు విపక్షాల నిరసనలతో హోరెత్తుతున్నాయి. మంగళవారం కూడా రాజ్యసభలో ఇదే దృశ్యం పునరావృతమైంది. ఎంపీల సస్పెన్షన్‌ రద్దునకు ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. కాంగ్రెస్‌ ఇతర ప్రతిపక్ష నేతలు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. 12 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండు చేశారు. అయితే నిబంధనలను అతిక్రమిస్తే ఫలితం ఉండదని, ఎంపీలంతా తమ స్థానాల్లో కూర్చోవాలని, తనపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలను మానుకోవాలని, తనను సభికులు శాసించలేరని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. నినాదాలు ఆగకపోవడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటలకు ఆపై 2 గంటలకు సబను వాయిదా వేశారు. అనంతరం నిరసనలు కొనసాగడంతో గందరగోళనం నడుమ సభ కార్యకలాపాలను వెంకయ్య కొనసాగించారు. జిరో అవర్‌ జరిపించారు. వెల్‌లోకి వెళ్లిన వారిని మాత్రం మాట్లాడనివ్వలేదు. అనేకమంది సభ్యులు ఆందోళనలో పాల్గొనగా జిరో అవర్‌లో టీఎంసీ సభ్యుడు సుఖేందు శేఖర్‌ రాయ్‌ మాట్లాడారు. ఆప్‌ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ను సభ నుంచి బయటకు పంపివేయాలని అధికారులను వెంకయ్య ఆదేశించారు. సభాపతినే సవాల్‌ చేస్తారా అంటూ సింగ్‌పై అసహనం వ్యక్తంచేశారు. పేపర్ల లిస్టింగ్‌ అనంతరం జిరో అవర్‌ను ప్రారంభించారు. మరోవైపు విపక్షాల నిరసనలు నడుమ జిరో అవర్‌ గంటసేపు సాగింది. అది ముగిసే సమయానికి నిరసనలు మిన్నంటాయి. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు ప్రయత్నించగా నిరసన తెలిపే సభ్యులంతా ఎవరి స్థానాల్లో వారు కూర్చొని శాంతిస్తేనే ఎల్‌ఓపీని మాట్లాడనిస్తానని వెంకయ్య అన్నారు. వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేస్తే ఫలితం ఉండదన్నారు. ‘మీరు నన్ను శాసించలేరు. సభ హూందాతనాన్ని, గౌరవాన్ని కాపాడదాం. ఇలా ఒత్తిడి తెచ్చే వైఖరి నా వద్ద పనిచేయదు’ అని వెంకయ్య అన్నారు. సభ్యుల సస్పెన్షన్‌ ఎత్తివేత నిర్ణయంపై పునరాలోచించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందిగానీ అందుకు ఆయా ఎంపీలు క్షమాపణ కోరాలన్నారు. నిబంధనలకు కట్టుబడి ఉంటేనే ఫలితం ఉంటుందిగానీ వాటిని అతిక్రమిస్తే కాదని సభ్యులకు హితవు పలికారు. అనేక అంశాలపై మాట్లాడిన ఎంపీలను వెంకయ్య అభినందించారు.
ప్రతిపక్ష ఎంపీల నిరసన ప్రదర్శన
పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నుంచి విజయ్‌చౌక్‌ వరకు ప్రతిపక్ష ఎంపీల ర్యాలీ సాగింది. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్షానికి పార్లమెంటులో అవకాశం ఇవ్వడం లేదని, ఇది కేవలం ప్రదర్శనశాలగా మారిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఘాటు విమర్శలు చేశారు. ‘సమస్యలపై మాట్లాడేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ అడ్డుకుంటూనే ఉన్నారు. సమస్యలను లేవనెత్తే అవకాశాన్ని ఇవ్వడం లేదు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక అంశాలను అసలు అనుమతివ్వరు’ అని ఆయన విలేకరులతో అన్నారు. ప్రధాని మోదీ పార్లమెంటుకే రారని, ప్రజాస్వామ్యాన్ని నడిపించే పద్ధతి ఇది కాదన్నారు. ‘సస్పెన్షన్‌కు గురైన సభ్యులు మాతోనే ఉన్నారు. వీరిని రెండు వారాల కోసం సస్పెండ్‌ చేశారు. వీరంతా బయట కూర్చొని ఉన్నారు. వీరి గొంతుకను అణచివేశారు. ప్రధానంశాలపై మాట్లాడేందుకు మాకు అనుమతి లేదు. ప్రజాస్వామ్యం ఖూనీ కావడం దురదృష్టకరం’ అని రాహుల్‌ తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. సభ్యుల సస్పెన్షన్‌ అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ వారిని సభలోకి అనుమతించాలని ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి డిమాండు చేస్తున్న విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img