వామపక్ష పార్టీల డిమాండ్
న్యూదిల్లీ : గాజాలో తక్షణమే కాల్పులు విరమించి, పోరు ముగించాలని ఐదు వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఉమ్మడి ప్రకటనను గురువారం విడుదల చేశాయి. గాజాలో ఇజ్రాయిల్ దురాక్రమణకు అక్టోబరు 7వ తేదీకి ఏడాది పూర్తి అవుతుందని, ఆ రోజును ఘర్షణ ముగింపునకు డిమాండ్ దినంగా పాటిస్తామని పేర్కొన్నాయి. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, అఖిలభారత ఫార్వడ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ), రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్‌ఎస్‌పీ) ప్రధాన కార్యదర్శులు డి.రాజా, దీపాంకర్ భట్టాచార్య, జి.దేవరాజన్, మనోజ్ భట్టాచార్యతో పాటు సీపీఎం తరపున ప్రకాశ్ కారత్ ఈ ప్రకటన విడుదల చేశారు. ‘గాజాలో ఇజ్రాయిల్ దురాక్రమణ మొదలై అక్టోబరు 7వ తేదీకి ఏడాది. హమాస్ అంతమే లక్ష్యమంటూ మారణహోమాన్ని ఇజ్రాయిల్ కొనసాగిస్తోంది. పలస్తీనా ప్రజలపై విచక్షణారహితంగా దాడులు చేస్తోంది. ఇప్పటివరకు 42 వేల మంది పలస్తీనియన్లు చనిపోయారు. వీరిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. వేలాదిమంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులనూ వదలకుండా భూతల, వైమానిక దాడులను ఇజ్రాయిల్ సాయుధ దళాలు కొనసాగిస్తున్నాయి. ఆగస్టు 6వతేదీ నాటికి ఇజ్రాయిల్ దురాక్రమణలో ప్రత్యక్ష, పరోక్ష మరణాలు 85 వేలకు పైమాటేనని ‘ది లాన్సెట్’ తెలిపింది’ అని ప్రకటన పేర్కొంది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఉత్తర్వులను సైతం ఇజ్రాయిల్ బేఖాతరు చేయడాన్ని గుర్తు చేసింది. కాల్పుల విరమణ కోసం చేపట్టే అర్థవంతమైన చర్చలనూ ధిక్కరించిందని, గాజాలో సైనిక చర్యను నిర్దాక్షిణ్యంగా సాగిస్తోందని విమర్శించింది. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని పలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ భీకర దాడులు చేసిందని, పేజర్లు, వాకీటాకీలు వంటి కమ్యూనికేషన్ పరికరాలు పేల్చి… విధ్వంసం సృష్టించేందుకు యత్నించిందని, యుద్ధాన్ని లెబనాన్‌కు విస్తరించిందని ప్రకటన పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇజ్రాయిల్ తీరును నిరసిస్తూ, గాజాపై దురాక్రమణ ముగింపునకు డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేసింది.