Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

దుష్ట ఏనుగుల్లాంటివారు..

ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను కాలరాస్తారు…
బీజేపీ యేతర రాష్ట్రాల గవర్నర్లపై శివసేన విసుర్లు
ముంబై :
వాళ్లంతా దుష్ట ఏనుగుల్లాంటి వారు..ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని, చట్టాలను, రాజకీయ సంస్కృతిని తమ కాళ్ల కింద నలిపివేస్తున్నారని మహారాష్ట్ర సహా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల గవర్నర్లనుద్దేశించి శివసేన ఘాటువ్యాఖ్యలు చేసింది. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను అస్థిరపర్చేందుకు అక్కడి గవర్నర్లను కేంద్రం వాడుకుంటోందని మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారి పేరును ప్రస్తావించకుండా ‘సామ్నా’ సంపాదకీయం దుయ్యబట్టింది. గవర్నర్‌ కోశ్యారికి, మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు లేవన్న సంగతి తెలిసిందే. తన కోటా నుంచి 12 ఎమ్మెల్సీల నియామకాన్ని ఆమోదించడంలో చేస్తున్న జాప్యానికిగాను కోశ్యారిపై ఉద్ధవ్‌ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇలాంటి అనేక వివాదాలు వీరిమధ్య ఉన్నాయి. అయితే బీజేపీ యేతర రాష్ట్రాల గవర్నర్లు దృష్ట ఏనుగుల్లా ఉంటే వారి మహౌట్లు న్యూదిల్లీలో ఉన్నారని, వీరు ప్రజాస్వామ్య పద్ధతులను, చట్టాలను, రాజకీయ సంస్తృతిని తమ కాళ్ల కింద తొక్కిపారేస్తున్నారని, బీజేపీయేతర పార్టీ అధికారంలో ఉందన్న కారణంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను అస్థిరపర్చేందుకు గవర్నర్లు తమ పూర్తి అధికారాలను వినియోగించడం ఆమోదయోగ్యం కాదని శివసేన వ్యాఖ్యానించింది. ఇటువంటి చర్యలు దేశ ఐక్యతను దెబ్బతిస్తున్నాయని, అగ్గిరాజేసే క్రమంలో సొంత చేతులే కాలిపోగలవని హెచ్చరించింది. ‘ప్రజాస్వామిక వ్యవస్థల పతనానికి ప్రభుత్వ పోస్టుల వినియోగం ఎంత వరకు సమంజసం. దేశ రాజధానిలో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడం ద్వారా ప్రజాస్వామ్యం సుస్థిరంగా ఉంటుందని, అభివృద్ధి చెందుతుందని భావిస్తున్న వారంతా పతనమైన ఫెడరల్‌ ప్రభుత్వాల మొరను ఆలకించినట్లు లేరు. రాష్ట్రాలను సరిగ్గా పనిచేయనివ్వడం లేదు. రాష్ట్రాల్లో అల్లర్లు సృష్టించేలా పార్టీ ఏజెంట్లకు అధికారం ఇస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్‌ కోశ్యారి రాష్ట్రంలోని మహిళల భద్రతపై శాంతి భద్రతల పరిస్థితిపై ఆవేదన వ్యక్తంచేశారు. మరి ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ గవర్నర్లు ఎందకని అలా చేయలేదు? మహారాష్ట్రలోని బీజేపీ మహిళా ఎమ్మెల్యేలు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మహిళా శాసనసభ్యుల మౌనానికి కారణమేమిటో! మహారాష్ట్రలోనే ఇంతటి రభస ఎందుకు జరుగుతోంది? యూపీ, ఎంపీల్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టే అక్కడ జరిగే నేరాలు`ఘోరాలపై మౌనంగా ఉంటున్నారా? ఓ మతగురువు అనుమాన్పద స్థితిలో మరణించినా, ఉత్తరప్రదేశ్‌లో, మధ్యప్రదేశ్‌లో మహిళలపై దాడులు జరిగినా కావాలనే పట్టించుకోవడం లేదా? అని సామ్నా సంపాదకీయం ప్రశ్నల వర్షం కురిపించింది. అదే సమయంలో బీజేపీయేతర రాష్ట్రాలపై బురదజల్లే తమ పార్టీ నేతలకు కేంద్రప్రభుత్వం అదనపు పోలీసు రక్షణ కల్పించడాన్ని దుయ్యబట్టింది. ఇటీవల మాజీ ఎంపీ సొమయాకు జెడ్‌ కేటగిరి భద్రతనుద్దేశించి ‘ నక్సల్‌ కార్యకలాపాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వేర్వేరు ర్ఱాష్టాల ముఖ్యమంత్రులతో సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. అదే సమయంలో మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలపై బురదజల్లే తమ వాళ్ల భద్రత కోసం వందలాది మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను నియమించారు. సీఆర్పీఎఫ్‌ దళాలను నక్సల్స్‌పై చర్యలకు వాడితే సబబుగా ఉంటుందా లేక కొందరికి రక్షణ కోసమా!? అని కేంద్రంపై తనదైన శైలిలో శివసేన విమర్శలు గుప్పించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img