అందుబాటులో ప్రతి వెయ్యిమందికి 1.96శాతం మాత్రమే
న్యూదిల్లీ: సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడం ప్రస్తుతం దేశంలో క్లిష్టంగా మారింది. మంచి ఆరోగ్యాన్ని అందించేందుకు డాక్టర్లున్నా, రోగిని జాగ్రత్తగా చూసుకునే నర్సులు కరువవుతున్నారు. దీంతో సంపూర్ణ ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో ప్రతి వెయ్యి మందికి కనీసం ఇద్దరు నర్సులు ఉండటం గగనంగా మారింది. రోగికి వైద్యసేవలు అందించాల్సి ఈ రంగంలో కొరత స్పష్టంగా కనబడుతోంది. ప్రతి ఒక్కరూ డాక్టర్ కోర్సుల వైపే మొగ్గుచూపుతున్నారు కానీ, నర్సుల వృత్తిపై కన్నెత్తి చూసే వారు ప్రస్తుతం కరువయ్యారు. ఈ కారణంగా అట్టడుగు వర్గాలకు, మన్యం ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందని ద్రాక్షగానే మారాయి. తాజాగా కేంద్రం లెక్కల ప్రకారం దేశంలో ప్రతి వెయ్యిమందికి 1.96శాతం మంది నర్సులు అందుబాటులో ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం రాజ్యసభకు తెలిపింది. ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రికార్డు ప్రకారం 33.41లక్షల మంది నర్సింగ్ సిబ్బంది ఉండగా, 23,40,501మంది రిజిస్టర్డ్ నర్సులు, మిడ్వైవ్స్ ఉండగా, 10,00,805మంది నర్స్ అసోసియేట్స్, 56,854మంది హెల్ విజిటర్స్ ఉన్నారని వివరించారు. స్టేట్ మెడికల్ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కమిషన్లో ఇప్పటి వరకూ 13,01,319మంది అల్లోపతిక్ డాక్టర్లు రిజిస్టర్ అయ్యారని ఆయన వివరించారు.