రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు
న్యూదిల్లీ : తీర ప్రాంత భద్రతతో పాటు కోవిడ్ కారణంగా ఎదురైన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో నావికాదళం విశేష కృషి చేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. ‘మీ సేవలను భారతీయులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు’ అని నావికాదినోత్సవం సందర్భంగా నావికా సిబ్బంది, వారి కుటుంబాలకు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. భారత్`పాకిస్థాన్ యుద్ధ సమయంలో కరాచీ హార్బర్‌పై నావికాదళం దాడి చేసిన డిసెంబరు 4వ తేదీన యేటా నేవీ డే నిర్వహించుకుంటున్నారు. ‘నావికాదినోత్సవాన్ని పురస్కరించుకొని నావికా సిబ్బంది, ప్రముఖులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. అంతేకాకుండా సముద్ర తీర ప్రాంత పరిరక్షణ కోసం నావికాదళం బాగా పనిచేస్తోంది’ అని కోవింద్ శనివారం ట్వీట్ చేశారు.
నావికాదళం సేవలు దేశం గర్వించేలా ఉన్నాయని ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. నావికాదళం ధైర్యసాహసాలు, ప్రొఫెషనలిజాన్ని కొనియాడారు. ప్రకృతి వైపరీత్యాలు వంటి విపత్కర సమయాల్లోనూ నావికాదళం పాత్ర అనిర్వచనీయమని మోదీ ట్వీట్ చేశారు.