Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

నితీశ్‌కు షాక్‌..మణిపూర్‌లో బీజేపీతో చేతులు కలిపిన జేడీయూ ఎమ్మెల్యేలు

మణిపూర్‌లోని బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు చెందిన జనతాదళ్‌ (యునైటెడ్‌)కి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. బీహార్‌లో నితీశ్‌కుమార్‌ పార్టీ జేడీయు బీజేపీతో పొత్తును విరమించుకుని.. రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ), కాంగ్రెస్‌, ఇతర పార్టీలతో జతకట్టిన కొన్ని వారాల తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం. ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు అధికార పార్టీ బీజేపీలో చేరినట్లు మణిపూర్‌ శాసనసభ సెక్రటేరియట్‌ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయు ఆరు స్థానాలను గెలుచుకుంది. జోయ్‌ కిషన్‌ సింగ్‌, ఎన్‌ సనాతే, ఎండీ అచాబ్‌ ఉద్దీన్‌, ఎల్‌ఎం ఖౌటే, తంజామ్‌ అరుణ్‌కుమార్‌లు బీజేపీలో చేరారు. ఎల్‌ఎం ఖౌటే, తంజామ్‌ అరుణ్‌కుమార్‌ గతంలో బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నించారు. కానీ పార్టీ తిరస్కరించడంతో జేడీయూలో చేరి విజయం సాధించారు. ఈశాన్య రాష్ట్రాల్లో నితీష్‌ కుమార్‌ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ టార్గెట్‌ చేయడం వరుసగా ఇది రెండోసారి. 2020లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఏడుగురు జేడీయు ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీలో చేరారు. గత వారం ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో నితీశ్‌ కుమార్‌ పార్టీ ఆన వాళ్లు లేకుండా పోతుందని బీహార్‌ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోడీ ఎద్దేవా చేశారు. మొన్న అరుణాచల్‌ ప్రదేశ్‌, ఇప్పుడు మణిపూర్‌లో జేడీయూ పార్టీ ఆనవాళ్లు లేకుండా పోయిందని, త్వరలో లాలూ కూడా బీహార్‌లో జేడీయూను తుడిచిపెట్టుకుపోయేలా చేస్తారని ట్వీట్‌ చేశారు. సుశీల్‌ మోడీ పగటి కలలు కంటున్నారంటూ జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ చురకలంటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img