నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌బుద్ధనగర్‌లో 15మంది చిన్నారులతో సహా 55మందికి కరోనా సోకినట్టు ఆరోగ్యశాఖ అధికారులు గురువారం తెలిపారు. దీంతో జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 100 మార్కును అధిగమించి 121కి చేరిందని పేర్కొన్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి 44మంది కరోనా బారినపడ్డారని, 12మందికి నయమైందని వివరించారు. ‘కొత్త కేసులో 15మంది చిన్నారులు పాజిటివ్‌గా గుర్తించబడ్డారు. వీరు ఏ పాఠశాలకు చెందినవారు కాదు’ అని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్ శర్మ తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్ నిమిత్తం 68 నమూనాలను ల్యాబ్‌కు పంపినట్టు సీఎంఓ గురువారం తెలిపింది. కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో నోయిడా, గ్రేటర్ నోయిడా పరసర ప్రాంతాల్లోని పాఠశాలల్లో దగ్గు, జలుబు, జ్వరం, విరోచనాలు, ఇంకా కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి తక్షణమే చికిత్స అందజేయాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది.