Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

పంజాబ్‌ సీఎంగా మాన్‌ ప్రమాణం

న్యూదిల్లీ: భగత్‌ సింగ్‌ పుట్టిన గ్రామమైన షహీద్‌ భగత్‌ సింగ్‌ నగర్‌ జిల్లాలోని ఖాట్కర్‌ కలాన్‌లో పంజాబ్‌ ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ బుధవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అన్న భగత్‌ సింగ్‌ నినాదంతోనే తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముగించారు. ప్రమాణ స్వీకారం అనంతరం తన సహచర ఎమ్మెల్యేలకు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఓ విజ్ఞప్తి చేశారు. ‘మనకు ఓటు వేయని ప్రజలపై కోపం, విద్వేషం చూపించవద్దు. వారినీ మనం గౌరవించి తీరాల్సిందే. మీ అందరికీ, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కు నా కృతజ్ఞతలు’ అని అన్నారు. భగత్‌ సింగ్‌కు స్వాతంత్య్రం వస్తుందా రాదా అనేదానికన్నా వచ్చిన స్వాతంత్య్రాన్ని భారత్‌ ఎలా నిలుపుకోగలదనే విషయంపైనే ఎక్కువ చింత ఉండేదని ఈ సందర్భంగా మాన్‌ వ్యాఖ్యానించారు. భగత్‌ సింగ్‌, బాబాసాహెబ్‌ కలలను నెరవేర్చడానికి పంజాబ్‌ మొత్తం ప్రమాణం చేస్తుంది అని మాన్‌ ప్రమాణ స్వీకారానికి ముందు తెలిపారు. పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆమ్‌ ఆద్మీపార్టీ (ఆప్‌) చీఫ్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా సహా అనేకమంది పార్టీ నాయకులు, ఇతర ప్రముఖులు, వేలాది మంది ప్రజలు విచ్చేశారు. పసుపు రంగు తలపాగాలు చుట్టుకుని భగవంత్‌మాన్‌ కు మద్దతు తెలిపారు. కేజ్రీవాల్‌, సిసోడియా కూడా పసుపు రంగు పాగాలు ధరించి రావడం విశేషం. ప్రమాణ స్వీకార వేదిక వద్ద పది వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. మాన్‌ ప్రమాణ స్వీకారానికి ప్రజలు భారీగా తరలి రావడంతో భగత్‌ సింగ్‌ పూర్వీకుల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కాగా 1970 తర్వాత సీఎం పగ్గాలు చేపడుతున్న చిన్న వయస్కుడు భగవంత్‌ మాన్‌ (48) కావడం విశేషం. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 117 స్థానాల్లో పోటీ చేసిన ఆప్‌.. 92 స్థానాలను గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర ముఖ్య పార్టీలను పంజాబ్‌ గడ్డపై ఆ పార్టీ మట్టికరిపించింది. సంగ్రూర్‌ జిల్లా ధూరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భగవంత్‌ మాన్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి దల్వీర్‌ సింగ్‌ గోల్డీపై 58 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోదీ సహా ప్రముఖుల అభినందన
పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భగవంత్‌ మాన్‌కు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అనేకమంది ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. పంజాబ్‌ అభివృద్దికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా భగవంత్‌కు మోదీ సూచించారు. కేంద్రం నుంచి పంజాబ్‌కు సహకారం లభిస్తుందని మోదీ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘పంజాబ్‌ ముఖ్యమంత్రి శ్రీ భగవంత్‌ మాన్‌ జీకి శుభాకాంక్షలు! అతని సమర్థ నాయకత్వంలో పంజాబ్‌లో ప్రగతి, సౌభ్రాతృత్వం, కొత్త దృక్పథం వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. పంజాబ్‌ అభివృద్ధి శిఖరాలను అధిరోహించాలి’ అని యూపీ మాజీ ముఖ్యమంత్రి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌ ట్వీట్‌ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌ మాన్‌ను అభినందించారు. పంజాబ్‌లో కొత్త ప్రభుత్వం విజయవంతం కావాలని కోరుకుంటున్నానని స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్పంస్తూ… ‘పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు శ్రీ భగవంత్‌ మాన్‌ జీకి అభినందనలు. మీ నాయకత్వంలో రాష్ట్ర ప్రజల మద్దతుతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు’ అని పట్నాయక్‌ ట్విట్టర్‌లో రాశారు. దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు పంజాబ్‌ వెళ్లడానికి ముందు ‘పంజాబ్‌కు ఈ రోజు గొప్ప రోజు. కొత్త ఆశలతో కూడిన ఈ బంగారు ఉదయంలో, ఈ రోజు మొత్తం పంజాబ్‌ ఒక్కతాటిపైకి వచ్చి దానిని సంపన్న పంజాబ్‌గా మార్చేందుకు ప్రతిజ్ఞ చేయనుంది.’ అని ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img