బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు
వాషింగ్టన్: గత పదేళ్లలో భారత్‌లో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైందని, కానీ ప్రస్తుతం నిలదొక్కుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య మనుగడ కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ… దానిని పడగొడుతున్నారని బీజేపీపై విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తమ నుంచి దూరం చేశారని, అదంతా తన కళ్ల ముందే జరిగిందన్నారు. తమ శాసనసభ్యులు అనూహ్యంగా బీజేపీ సభ్యులయ్యారని, దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని, బలహీనంగా మారిపోయిందని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు తన పోరాటం జరుగుతోందని రాహుల్ అన్నారు. ఎన్నికల ఫలితాలు చూస్తే… భారత ప్రజాస్వామ్యంపై మరింత ఆశ కలుగుతోందన్నారు. తాము ఎన్నికల్లో పోటీ చేసేముందు తమ పార్టీ బ్యాంకు ఖాతాలన్నీ స్తంభించాయని, ఏదైనా ప్రజాస్వామ్య దేశంలో ఇలా జరిగి ఉంటుందో, లేదో తనకు తెలియదన్నారు. ఇలాంటి పరిస్థితులు సిరియా, ఇరాక్‌లలో ఉండొచ్చని, ఎన్నికల ముందు తమ కోశాధికారిని అడిగితే డబ్బు లేదన్నారని, కానీ తమ ముందు ఓటరు ఉన్నాడని, అతడితోనే తాము మాట్లాడామని వివరించారు. తనపై దాదాపు 20 కేసులు పెట్టారని, భారతదేశ చరిత్రలో పరువునష్టం కేసులో జైలు శిక్ష ఎదుర్కొన్న ఏకైక వ్యక్తిని తానేనని, తమ ముఖ్యమంత్రి ఒకరు ఇప్పుడు జైల్లోనే ఉన్నారన్నారు. కానీ తమకు భారతీయ ఓటరు ఉన్నాడని, అతడు రాయివలే దృఢంగా నిలబడి ఉన్నాడని, కానీ అతడు పనిచేయడానికి కావాల్సిన ఆర్కిటెక్చర్ అక్కడ లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తూ ‘21వ శతాబ్దంలో ఆధునిక దేశ ప్రధానమంత్రి ఒకరు… నేను దేవుడితో మాట్లాడుతున్నానని చెబుతున్నారు. నేను అందరికంటే భిన్నం అంటారు. తనని తాను జీవసంబంధమైన వ్యక్తిని కాదంటారు. ఆ ప్రధానిని మేం ఓడిరచామని మాకు తెలుసు’ అని అన్నారు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థల పనితీరు దెబ్బతినడం వల్ల తాము జోడో యాత్ర చేయవలసి వచ్చిందని వెల్లడిరచారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలతో మమేకం కావడం మినహా తమకు మరోమార్గం కనిపించలేదన్నారు.