Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

పరీక్షలు లేకుండా ఫెయిల్‌ ఎలా చేస్తారు…?

బెంగాల్‌లో విద్యార్థుల ఆందోళన
స్కూళ్లలో విధ్వంసం` రహదారుల దిగ్బంధం

కోల్‌కతా : కొవిడ్‌ కారణంగా పరీక్షలే జరపనప్పుడు కొందరిని పాస్‌ చేసి మమ్మల్ని ఫెయిల్‌ ఎలా చేశారు..? చేస్తే అందరిని పాస్‌ లేదా ఫెయిల్‌ చేయాలంటూ పశ్చిమ బెంగాల్‌లో 12వ తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు శనివారం నుంచి ఆందోళనకు దిగారు. తమ స్కూళ్లలో విధ్వంసం సృష్టించారు. రహదారులను దిగ్బంధించారు. ఈ ఏడాది 8,19,202 విద్యార్థుల్లో 97.69శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే 12వ తరగతి ఫలితాలను పశ్చిమ బెంగాల్‌ ఉన్నత విద్యా మండలి (డబ్ల్యూబీసీహెచ్‌ఎస్‌సీ) ప్రకటించగా ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. కొవిడ్‌ కాలంలో పరీక్షలు లేవు, మూల్యాంకనం పద్ధతి గందరగోళానికి గురిచేసింది. ఇప్పుడు కొందరు పాస్‌ మరికొందరిని ఫెయిల్‌ అయినట్లు ఎలా నిర్థారిస్థారని విద్యార్థులు అసహనం వ్యక్తంచేశారు. కొందరు విద్యామంత్రి బ్రత్య బాసు ఇంటి వైపుకు కదం తొక్కగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశంపై అనేక స్కూళ్ల ప్రతినిధులతో డబ్ల్యూబీసీహెచ్‌ఎస్‌ఈ అధ్యక్షులు మహువా దాస్‌ చర్చలు జరుపుతున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. కాగా, పశ్చిమ మెడ్నీపూర్‌ జిల్లాలోని ఇందా కృష్ణలాల్‌ శిక్షానికేతన్‌ విద్యార్థులు కొందరు తరగతి గదుల్లోకి దూసుకెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. తమనూ పాస్‌ చేయాలని డిమాండు చేశారు. ముర్షిదాబాద్‌ జిల్లాలోని హరిహర్పారాలోనూ ఆందోళనలు మిన్నంటాయి. సరత్పూర్‌ బిద్యాలయ ‘ఫెయిల్‌’ విద్యార్థులు టైర్లకు నిప్పు పెట్టి రోడ్డును దిగ్బంధించారు. మాల్డా జిల్లాలోని హబీబ్‌పూర్‌Ñ ఉత్తర 24 పరగణాలలోని మధ్యంగ్రామ్‌ ఛౌమతా వద్ద రహదారులను విద్యార్థులు దిగ్బంధించారు. ఆందోళనల్లో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులూ పాల్గొన్నారు. సాల్ట్‌ లేక్‌లోని పశ్చిమ బెంగాల్‌ ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
బీజేపీ రాజకీయం…
బీజేపీ తన కపట బుద్ధిని పోనిచ్చుకోలేదు. విద్యార్థుల ఆందోళననూ రాజకీయం చేసేందుకు యత్నించింది. ఓ వర్గం మెప్పు కోసమే ఫలితాలు ఇలా ఉన్నాయంటూ మతచిచ్చు పెట్టే ప్రయత్నాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ చేశారు. మహమ్మారి కాలంలో పరీక్షలే జరగనప్పుడు గ్రేడ్లు ఎందుకు ప్రకటించినట్లో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img