అగ్నిపథ్ పై చర్చకు విపక్షాల పట్టు
రాజ్యసభ రేపటికి వాయిదా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే తాజాగా ఎన్నికైన ముగ్గురు ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం తాజాగా హత్యకు గురైన జపాన్ ప్రధాని షింజో అబేకు పార్లమెంట్ నివాళులు అర్పించింది. ఆ తర్వాత విపక్షాలు అగ్నిపథ్ సహా పలు అంశాలపై చర్చకు పట్టుబట్టారు. ఈ సమయంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు సభ్యులకు అనుమతిస్తూ లోక్ సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడిరది. మరోవైపు రాజ్యసభలో ఉదయం ప్రారంభం కాగానే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం విపక్షాలు అగ్నిపథ్ పై చర్చకు పట్టుబట్టాయి. అన్ని ముఖ్యమైన అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం చెప్పింది. కానీ వర్షాకాల సమావేశాల గడువు చాలా తక్కువగా ఉందని, కేంద్రం లిస్ట్ చేసిన 32 బిల్లులను సభ చేపట్టలేకపోవచ్చునని ప్రతిపక్షం పేర్కొంది. నాలుగు శుక్రవారాల్లో ప్రైవేట్ సభ్యుల బిజినెస్ సహా సెషన్లో 18 సిట్టింగ్లు ఉంటాయని గుర్తుచేసింది. ఆగస్టు 12న వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగనున్నాయి.