శాఖలకు సీపీఐ పిలుపు
న్యూదిల్లీ: ఇంధన ధరల పెంపుపై సీపీఐ ఆగ్రహం వ్యక్తంచేసింది. పెట్రో ఉత్పత్తుల ధరలు వెంటనే తగ్గించాలని మోదీ సర్కారును డిమాండ్ చేసింది. పెట్రోలు, డీజిలు ధరలను విచ్చలవిడిగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 4 నుంచి 10వ తేదీ వరకు వారం రోజులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలపాలని పార్టీ శాఖలకు పిలుపునిచ్చింది. స్వతంత్రంగానూ లేదా అవకాశమున్న ప్రతిచోట భావసారూప్య పార్టీలతో కలిసి ఉద్యమాలు చేయాలని విజ్ఞప్తి చేసింది. సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గం ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇష్టానుసారం ఇంధన ధరలు పెంచడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిరచింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గడచిన పది రోజుల్లో 9 రోజులు పెట్రోలు, డీజిలు ధరలు పెంచిందని విమర్శించింది. లీటరు పెట్రోలు, డీజిలు ధర అన్ని రాష్ట్రాల్లో రూ.100 దాటిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో రూ.117కి చేరింది. ముంబైలో పెట్రోలు లీటరు రూ.116.72కు పెరిగింది. డీజిలు రూ.100.96కు చేరింది. మెట్రో నగరాల్లో ముంబైలోనే పెట్రో ధరలు అధికంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కొంతకాలం పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచకుండా ఆపారు. ఆ ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడం కోసం విరామం ఇచ్చారు. వంటగ్యాస్ ధరను సైతం విచ్చలవిడిగా పెంచారు. ప్రజలపై కనీసం దయ లేకుండా ప్రతిరోజు ధరలు పెంచుతున్నారు. ప్రజల సాధకబాధకాలపై ఆర్ఎస్ఎస్`బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి ఆందోళన, బాధ లేదని ఇది రుజువు చేస్తోంది. ఇంధన ధరలు రోజూ విపరీతంగా పెంచుకుంటూ పోవడం వల్ల..ఆ ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతుందన్న వాస్తవాన్ని సైతం మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇంధన ధరల పెంపుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. అసలు రోజువారీ సమీక్ష విధానాన్ని ఎత్తివేయాలని హితవు పలికింది.