కరోనా వైరస్ ఇక ఖతమైనట్టేనని భావిస్తున్న వేళ దేశంలో పెరుగుతున్న కేసులు మళ్లీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు పదుల సంఖ్యలో నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ వేలల్లోకి చేరాయి. నిన్న వరుసగా రెండో రోజు కేసులు 3 వేల మార్కును దాటింది. ఒక్క మహారాష్ట్రలోనే దాదాపు 700 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ ప్రయాణకులను పరీక్షించేందుకు థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి వందమంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే వారికి మాత్రం కరోనా పరీక్షలు, ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదన్నారు. అయితే, కరోనా లక్షణాలున్నట్టు అనిపిస్తే మాత్రం మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.