Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

ప్రజల జీవితాల మెరుగులో మీడియా పాత్ర కీలకం

మాతృభూమి శతవార్షికోత్సవంలో మోదీ
కోజికోడ్‌: ప్రజల కోసం అమలు చేస్తున్న ప్రభుత్వ విధానాలు, ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావడంలో మీడియా అతిముఖ్యమైన, సానుకూల పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌, బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర చాలా ఉందని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను మీడియా ప్రజల్లోకి తీసుకెళుతున్నట్లు చెప్పారు. అత్యంత ప్రజాదరణ గల ప్రభుత్వ పథకాలతో పాటు యోగా వంటి కార్యకలాపాలను మీడియా బాగా ప్రచారం చేస్తోందని తెలిపారు. దీనితోపాటు స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో జరిగిన ప్రజలకు తెలియని అంశాలను, ఇప్పటికీ గుర్తింపు లభించని సమరయోధుల గురించి ప్రపంచానికి తెలియజేయాలని మోదీ సూచించారు. ‘ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మంచి విధానాలు అమలు చేయడం ఒక అంశమైతే..ఆ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం మరో పార్శ్యం. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మీడియా కీలక పాత్ర పోషించాలి. ఏళ్లు గడుస్తున్న కొద్దీ మీడియా ప్రభావం సానుకూలంగా ఉన్నట్లు నేను చూస్తున్నాను’ అని మోదీ చెప్పారు. ప్రముఖ మలయాళ దినపత్రిక మాతృభూమి శతవార్షికోత్సవం సందర్భంగా మోదీ శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించారు. స్వాతంత్య్రోద్యమంలో ప్రతి పట్టణం, గ్రామానికి భాగస్వామ్యం ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆ ప్రాంతాలు, అక్కడి ప్రజల భాగస్వామ్యం గురించి ప్రపంచానికి తెలియజేయాలి. ఆ ప్రాంతాలను సందర్శించేలా ప్రజలను ప్రోత్సహించాలి. దీనితోపాటు మీడియాకు సంబంధం లేని వర్తమాన రచయితలను ప్రోత్సహించాలి’ అని మోదీ విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌`19 మహమ్మారిని దేశం ఎలా ఎదుర్కొన్నది. దీని ద్వారా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ఏమి చేశామనే అంశాలను ప్రధాని వివరించారు. కరోనా మహమ్మారి ప్రవేశంతో దీనిని ఎదుర్కొనే శక్తి భారత్‌కు లేదని పెద్దఎత్తున ప్రచారం జరిగిందని, ఈ విమర్శలు తప్పని భారతీయులు నిరూపించారని చెప్పారు. మన సమాజం, ఆర్థికవ్యవస్థ మెరుగు కోసం ఈ రెండేళ్లను మనం సమర్ధవంతంగా ఉపయోగించుకున్నామన్నారు. రెండేళ్లపాటు 80కోట్లమంది ప్రజలకు ఉచిత రేషన్‌ అందించామని, 180 కోట్లమందికి కరోనా టీకాలు వేయగలిగామని వివరించారు. ఇప్పటికీ చాలా దేశాలు తమ ప్రజలకు టీకాలు అందించలేకపోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆనేక పథకాలు, కార్యక్రమాలను ఏకరువు పెట్టారు. ఎన్‌డీఏ సర్కారు చేపట్టిన సంస్కరణలను వివరించారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసినట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనకు ‘గతిశక్తి’ శక్తివంచన లేకుండా పనిచేస్తోందన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మాతృభూమి పాత్రను ప్రశంసించారు. కేపీ కేశవ మీనన్‌, కేఏ దామోదర్‌ మీనన్‌, కేరళ గాంధీ కె.కెలప్పన్‌, కరూర్‌ నీలకంఠన్‌ నంబూద్రిపాద్‌ సేవలను గుర్తు చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, కేంద్రమంత్రి వి.మురళీధరన్‌, రాష్ట్ర పర్యాటకమంత్రి పీఏ ముహమ్మద్‌ రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img