Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారు


ప్రతిపక్షాలపై మంత్రి ప్రహ్లాద్‌ జోషి విసుర్లు
న్యూదిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సమయంలో ఉభయ సభల్లో అనేకసార్లు కలిగిన అంతరాయానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రతిపక్ష పార్టీలను నిందించారు. బుధవారం ఈ సమావేశాలు ముగిసిన సందర్భంగా జోషి మాట్లాడుతూ 2019లో ప్రజలు ఇచ్చిన తీర్పును వారు ‘జీర్ణించుకోలేక పోతున్నారు’ అని అన్నారు. లఖింపూర్‌ ఖేరీ హింసాకాండ, ధరల పెరుగుదల వంటి అంశాలపై ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో శీతాకాల సమావేశాలు ముగిసి లోక్‌సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడ్డాయి. కాగా లోక్‌సభ ఉత్పాదకత 82 శాతం, రాజ్యసభ ఉత్పాదకత 48 శాతం ఉన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. నవంబర్‌ 29న ప్రారంభమైన ఈ సమావేశాలు షెడ్యూల్‌ కన్నా ఒక రోజు ముందుగానే ముగిశాయి. ఆగస్టులో మునుపటి సమావేశాల్లో ‘క్రమశిక్షణారాహిత్యం’గా ప్రవర్తించారంటూ 12 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడంపై ప్రతిపక్షం నిరసన వ్యక్తం చేసింది. ‘వారు సభలో గందరగోళం సృష్టించారు. 2019లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అనిపిస్తోంది’ అని జోషి విలేకరుల సమావేశంలో అన్నారు. వివిధ మతాలకు చెందిన వ్యక్తిగత చట్టాలను అధిగమించేందుకు ఉద్దేశించిన బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లుతో సహా ఆరు బిల్లులను ప్రభుత్వం మరింత పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీలకు పంపిందని జోషి చెప్పారు. బిల్లులను, ముఖ్యంగా ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లును అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వలేదన్న ప్రతిపక్షాల ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. సమాచారంతో కూడిన చర్చకు సిద్ధం కావడానికి ముందుగానే బిల్లును సభ్యులకు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశాల్లో మొత్తం 13 బిల్లులను, లోక్‌సభలో 12 బిల్లులు, రాజ్యసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టగా, 11 బిల్లులను పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదించాయని జోషి చెప్పారు. బయోలాజికల్‌ డైవర్సిటీ (సవరణ) బిల్లు, 2021ని పార్లమెంట్‌ సంయుక్త కమిటీకి, ఐదు బిల్లులను స్టాండిరగ్‌ కమిటీలకు పంపించామని వివరించారు. పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదించిన 11 బిల్లుల్లో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్లకు నిర్ణయించే బిల్లులు ఉన్నాయని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img