. దిల్లీలో కదంతొక్కిన వేలాదిమంది స్కీమ్ వర్కర్లు
. కేంద్ర మంత్రులకు వినతులు
న్యూదిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని కోరుతూ వేలాదిమంది స్కీమ్ వర్కర్లు దిల్లీలో భారీ ర్యాలీ నిర్వహిం చారు. ఏఐటీయూసీ స్కీమ్ వర్కర్స్ వేదిక అధ్వర్యంలో వేలాదిమంది మహిళలు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ర్యాలీ చేశారు. తమను స్కీమ్ వర్కర్లుగా తాత్కాలికస్థాయికి దిగజార్చి కీలక మంత్రిత్వ శాఖలలో శాశ్వత సేవలు చేయించుకుంటున్నారని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, ‘ఆశా’ వర్కర్స్, బ్లాక్ ఫెసిలిటేటర్స్, మహారాష్ట్ర రూరల్ లైవ్లీ లీ హుడ్ మిషన్‌కు చెందిన ‘ఉమెడ్’ వర్కర్లు తమను ప్రభుత్వ ఉద్యోగు లుగా పరిగణించాలని, అప్పటివరకూ కనీస వేతనాలు ఇవ్వాలని, సామాజిక భద్రత, మెటర్నిటీ సదుపాయాలు సమకూర్చడం సహా ఇతర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ 5 వేలమందికి పైగా మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. స్కీమ్ వర్కర్ల ప్రతినిధుల బృందం కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి, కేంద్ర విద్యాశాఖమంత్రి, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ, మహిళా, శిశు అభివృద్ధిశాఖమంత్రులను వేరువేరుగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఈ డిమాండ్లను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళతామని, ఆయనే తుది నిర్ణయం తీసుకుంటారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.
ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జీత్ కౌర్ ర్యాలీని ప్రారంభించారు. ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. రాజ్యసభలో సీపీఐ పక్ష ఎంపీ వినయ్ విశ్వం, డీఎంకే ఎంపీ ఎం.షణ్ముగమ్ ర్యాలీలో ప్రసంగించారు. కార్మికులకు తమ మద్దతు తెలియజేశారు. స్కీమ్ వర్కర్ల పేరుతో వారి ఉద్యోగాలను, వారి శ్రమను హీనస్థితికి దిగజార్చి జాతికి వారు చేస్తున్న సేవలను గుర్తించడం లేదని, స్కీమ్ అనేది ఒక నిర్ణీత కాల పరిమితికి మాత్రమే లోబడి ఉంటుందని, కానీ అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, ఆశావర్కర్లు, బ్లాక్ ఫెసిలి టేటర్లు అత్యంత కీలకమైన విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి రంగాలలో అవిశ్రాంతంగా, కాలపరిమితికి అతీతంగా అజరామర సేవలు అందిస్తున్నారని, వారికి నెలకు రూ.24 వేల వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వేలాదిమంది మహిళలు నినాదాలు చేశారు. సీపీఐ కార్యదర్శి బాలచంద్ర కాంగో, ఎంఆర్ అంగన్వాడీ- బాల్వాడీ కర్మచారి యూనియన్ అధ్యక్షుడు సుకుమార్ దామ్లే ప్రసంగించారు. కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించిన ప్రతినిధిబృందంలో సీపీఐ ఎంపీ కె.సుబ్బరాయన్ వెంట ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి వహిదా నిజామ్, ఎండీఎం వర్కర్స్ ఫెడరేషన్, ఉమెడ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు శ్యామ్ కాలే, ఆశా ఫెడరేషన్‌కు చెందిన ప్రతినిధి మంగళ్ పాండే, అంగన్వాడీ వర్కర్స్ ఫెడరేషన్ ప్రతినిధి మాధురీ క్షీరసాగర్ తదితరులు ఉన్నారు. వీరంతా మంత్రి స్మృతి ఇరానీని కలుసుకుని సమస్యలు వివరించారు. కార్మికుల డిమాండ్లను మంత్రి అంగీకరించారు.
దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్ల పేరుతో ఆశావర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఉమెడ్ వర్కర్లు, మధ్యాహ్న భోజనం వర్కర్లు కీలకమైన విద్య, వైద్య, ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంరక్షణ రంగాలలో పునాది స్థాయిలో శాశ్వత ప్రాతిపదికపై సేవలు చేస్తున్నప్పటికీ తమను స్కీమ్ వర్కర్ల స్థాయికి దిగజార్చారని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో స్కీమ్ వర్కర్లు ప్రాణాలకు తెగించి అగ్రభాగాన నిలబడి గ్రామీణ ప్రాంతాలలో సేవలు అందించారు. వారి సేవలకు మెచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ముఖ్యంగా ఆశావర్కర్లకు ‘గ్లోబల్ హెల్త్ లీడర్స్’ అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించిన విషయాన్ని ఒకసారి గుర్తు చేశారు. సేవలకు తగిన ప్రతిఫలంగా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేవరకూ నెలకు రూ.24 వేలు జీతం ఇవ్వాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. వహిదా నిజామ్ (నేషనల్ ఆశా వర్కర్స్ ఫెడరేషన్), మాధురి క్షీరసాగర్ (ఆల్ ఇండియా అంగన్వాడీ వర్కర్స్ ఫెడరేషన్), శ్యామ్ కాలే (ఆల్ ఇండియా మిడ్ డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్, ఉమెడ్ వర్కర్స్ యూనియన్) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ నుండి స్కీమ్ వర్కర్స్ యూనియన్ జాతీయ సమితి నాయకులు జె.లలితమ్మ, ఎం.రమేశ్ బాబు, శాంతి, సుగుణమ్మ, స్రవంతి, ప్రేమచంద్ బాషా, సరోజమ్మ, హెల్డా తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.