Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

బీజేపీకి సవాలుగా యూపీ చివరి విడత

మిర్జాపూర్‌ : యూపీలోని అధికార బీజేపీకి చివరి విడత ఎన్నికలు సైతం చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఎంపీగా ప్రతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని ఎనిమిది నియోజకవర్గాలు సహా పక్కనే ఉన్న మీర్జాపూర్‌ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 7 న పోలింగు జరుగనున్న విషయం తెలిసిందే. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద సవాలుగా మారింది. గత ఎన్నికల్లో ఈ స్థానాలన్నీ బీజేపీ తన ఖాతాలో వేసుకున్నా ఇప్పుడు ఆ పరస్థితి లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. వారణాసికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మీర్జాపుర్‌ జిల్లాలోని చునార్‌, మరియాన్‌, మీర్జాపూర్‌ నగర్‌, ఛబేన్‌, మజ్వాన్‌ స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ కూటమి అభ్యర్థుల నుంచి గట్టి ప్రతిఘటన కనిపిస్తోంది. ఈ ఐదు స్థానాల్లో బీజేపీ నలుగురు అభ్యర్థులను నిలిపి మజ్వాన్‌ స్థానాన్ని తమ మిత్రపక్షమైన నిషాద్‌ పార్టీకి కేటాయించి పట్టు నిలుపుకోవడం కోసం నానా తంటాలు పడుతోన్నట్టు తెలుస్తోంది. ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ నేతృత్వంతోని అప్నాదళ్‌తో జత కట్టిన సమాజ్‌వాదీ పార్టీ ప్రచారంలో దూసుకెళుతోంది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం తదితర కీలకమైన సమస్యలతో సహా జిల్లా వాసుల్లో అధికార బీజేపీ పట్ల ఎన్నికల ప్రకటన ముందు నుంచి తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దీనికి అదనంగా వింధ్యాచల్‌ ఆలయ అభివృద్ధి పేరుతో బీజేపీ చేసిన విధ్వంసంపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాశీ విశ్వనాథ్‌ ప్రాజెక్టు తరహాలో చేపట్టిన వింద్‌ ప్రాజెక్టులో భాగంగా 930కి పైగా ఇళ్లను కూల్చివేయడంపై స్థానికులు బీజేపీ పట్ల ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాజెక్టు అభివృద్ధి అంటూ అందరి ఇళ్లను కూల్చిన బీజేపీ తనకు కావలసిన బ్రాహ్మణులు, వైశ్యుల స్థలాలను తెలివిగా తప్పిస్తూ ప్రాజెక్టును డిజైన్‌ చేయడం పట్ల జిల్లా అంతటా ఉన్న వివిధ సామాజిక వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే అంశం తాజా ఎన్నికల్లో పెను ప్రభావం చూపనున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా వారణాసిలోనే తమ పార్టీ నేల కదులుతుందనే భయంతోనే ప్రధాని ఏకంగా గత రెండు రోజులుగా తిష్టవేసినట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయం విధితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img