Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

బోర్డు నిర్వహణా లోపంతోనే దుర్ఘటన

ఆలయంలోకి లెక్కకు మించి అనుమతించారు… వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాటపై యాత్రికులు
స్వల్ప వాగ్వాదంతోనే విషాదం : డీజీపీ
కత్రా(జమ్ముకశ్మీర్‌) :
కొత్త సంవత్సరం ప్రారంభం రోజున వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించడానికి ఆలయ బోర్డు నిర్వహణాలోపమే కారణమని ప్రాణాలతో బయటపడిన కొందరు యాత్రికులు ఆరోపించారు. అయితే ఆలయ బోర్డు ఈ అభియోగాన్ని తోసిపుచ్చింది. ‘రద్దీని ఊహించే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం’ అని తెలిపింది. అయితే పోలీసు డైరెక్టర్‌ జనరల్‌(డీజీపీ) దిల్‌బాగ్‌ సింగ్‌ దురదృష్టకర సంఘటనకు స్వల్ప వాగ్వాదమే కారణమని తెలిపారు. ‘ఈ విషాదకర దుర్ఘటనకు నిర్వహణ లోపం తప్ప మరేమీ కారణం కాదు. వారు రద్దీ గురించి తెలుసుకున్నారు. కానీ ప్రజలను అడ్డంకులు లేకుండా అనుమతించారు’ అని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఒక యాత్రికుడు మృతదేహాన్ని గుర్తించడానికి మార్చురీ వెలుపల వేచి ఉండగా చెప్పారు. సంబంధిత అధికారులు తీర్థయాత్రను మెరుగ్గా నిర్వహించినట్లయితే ఈ పరిస్థితి వాటిల్లేది కాదని మరొక యాత్రికుడు చెప్పారు. ‘ఇలాంటి పరిస్థితి నిమిషాల ముందు జరిగింది. కానీ అదృష్టవశాత్తూ మేము ఎవరూ గాయపడలేదు. పరిస్థితి అదుపులోకి వచ్చింది. మేము ఇరుగుపొరుగు వాళ్లం 10 మంది సమూహంలో ఉన్నాం. యాత్రికులు ప్రతి ఒక్కరూ లోపలికి, బయటకు వెళ్లే తొందరలో భారీ తొక్కిసలాట జరిగింది’ అని వివరించాడు. చాలా మంది యాత్రికులు వెనక్కి వెళ్లకుండా అక్కడ నేలపైనే విశ్రాంతి తీసుకుంటున్నారని, దీంతో ఆలయంలో మరింత రద్దీ ఏర్పడిరదని ఆయన తెలిపారు. తన స్నేహితుడు అరుణ్‌ ప్రతాబ్‌ సింగ్‌ (30)ను కోల్పోయిన మరో యాత్రికుడు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ నుంచి వచ్చామని, ఆలయ భవన్‌ కిక్కిరిసిపోయిందని చెప్పారు. ‘నేను సుమారు 10 సంవత్సరాల క్రితం పుణ్యక్షేత్రాన్ని సందర్శించాను. కానీ ఈసారి భారీ రద్దీని చూసి ఆశ్చర్యపోయాను. విషాద ఘటన తర్వాత మేము నిస్సహాయంగా ఉండిపోయాం. ఉదయం 6 గంటల వరకు ఎటువంటి సహాయం లభించలేదు’ అని ఆయన ఆరోపించారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన రాణిదేవి ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం తమ అదృష్టమని అన్నారు. ‘చాలా మంది వ్యక్తులు నేలపై పడి చనిపోయి ఉండటాన్ని నేను చూశాను. గుండె పగిలిపోయింది’ అని ఆమె చెప్పింది. భవన్‌ వద్ద యాత్రికుల ‘నియంత్రిత రద్దీ’ కారణం అని ఆరోపించారు. ఈ తొక్కిసలాటలో నేలపై నిద్రిస్తున్న కొందరు నలిగిపోయారని మరో భక్తుడు ఆదిత్య శర్మ తెలిపారు. ఈ సంఘటన తరువాత చాలా మంది యాత్రికులు పూజలు చేయకుండానే ఆలయం బేస్‌ క్యాంప్‌ అయిన కత్రా నుండి బయలుదేరడం కనిపించింది. ‘మేము పఠాన్‌కోట్‌ నుండి వచ్చాము. తొక్కిసలాట కారణంగా మేము ‘దర్శనం’ చేసుకోకుండానే భవన్‌ నుండి తిరిగి వచ్చాం’ అని రేఖ చెప్పారు. ముగ్గురు పిల్లలతో సహా మరో ఐదుగురు కుటుంబ సభ్యులతో ఆమె ఆలయానికి వచ్చారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ప్రేమ్‌ సింగ్‌ మాట్లాడుతూ యాత్రికుల సంఖ్యను పరిమితం చేయనందున లేదా కోవిడ్‌-19 మార్గదర్శకాలు అమలులో లేనందున పూర్తి గందరగోళం చోటుచేసుకుందని చెప్పారు. ‘చాలా మంది ప్రజలు ఫేస్‌ మాస్కులు ధరించలేదు’ అని అన్నారు. భారీ రద్దీ నెలకొనడంతో ఎక్స్‌-రే చెకింగ్‌ పాయింట్‌ వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది కూడా యాత్రికులను హెచ్చరించినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రమాదం జరిగినప్పటికీ చాలా మంది యాత్రికులు పెద్ద క్యూలలో వేచి ఉండటం కనిపించింది. ఐదు గంటల పాటు వేచి చూస్తున్నా క్యూ ఏమీ కదలడం లేదని హరియాణాలోని కర్నాల్‌కు చెందిన నవదీప్‌ అన్నారు. ప్రమాద పరిస్థితిని సమీక్షించడానికి, నారాయణ ఆస్పత్రిలో గాయపడిన వారిని పరామర్శించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్న మొదటివారిలో ఆలయ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రమేష్‌ కుమార్‌ దుర్ఘటనపై స్పందించలేదు. యాత్రికుల రద్దీ దృష్ట్యా భద్రతతో సహా తగిన ఏర్పాట్లు చేశామని బోర్డుకు చెందిన మరొక అధికారి తెలిపారు. డీజీపీ మాట్లాడుతూ సంఘటనా స్థలం నుండి ప్రాథమిక సమాచారం ప్రకారం కొంతమంది యువకుల మధ్య వాగ్వాదం జరిగిందని, కొన్ని సెకన్లలోనే తొక్కిసలాట పరిస్థితి ఏర్పడిరదని చెప్పారు. ‘పోలీసులు, పౌర యంత్రాంగం అధికారులు వెంటనే స్పందించారు. తక్షణమే యాత్రికుల రద్దీని నియంత్రించే చర్యలు చేపట్టారు. కానీ అప్పటికే సమయం మించిపోయి, నష్టం జరిగింది’ అని ఆయన అన్నారు. పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ సీనియర్‌ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు దేవేందర్‌ సింగ్‌ రాణా మాట్లాడుతూ ఈ ఆలయంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిదని అన్నారు. ‘ఇది మనందరికీ ఒక విషాద సంఘటన. విచారకరమైన క్షణం. మరణించిన వారి మృతదేహాలను వారి కుటుంబాలకు తిరిగి ఇచ్చేలా, గాయపడిన వారికి తగిన చికిత్స అందించడానికి మొత్తం యంత్రాంగమంతా పని చేస్తోంది’ అని తెలిపారు. జమ్మూకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రికూట కొండలపై ఉన్న గర్భగుడి వెలుపల ఉన్న గేట్‌ నంబర్‌ 3 సమీపంలో తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 12 మంది మరణించారు. 15 మంది వరకు గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img