అహ్మదాబాద్: రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం ఇక్కడ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో సమావేశమయ్యారు. అహ్మదాబాద్ నగర శివార్లలోని శాంతిగ్రామ్‌లోని అదానీ గ్రూప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ‘గుజరాత్‌ను సందర్శించిన మొదటి బ్రిటిష్ ప్రధానికి అదానీ హెచ్‌క్యూలో ఆథిత్యమివ్వడం ఆనందంగా ఉంది. పునరుత్పాదకాలు, గ్రీన్ హెచ్2 ,కొత్త ఇంధనంపై దృష్టి సారించి వాతావరణ సుస్థిరతకు దోహదం చేసే ఎజెండాకు మద్దతు ఇవ్వడం, రక్షణ Ê ఏరోస్పేస్ సాంకేతికతల సహ-సృష్టికి బ్రిటిష్ కంపెనీలతో కలిసిపనిచేయడం సంతోషంగా ఉంది’ అని అదానీ తర్వాత ట్వీట్ చేశారు. శక్తి పరివర్తన, వాతావరణ క్రియ, ఏరోస్పేస్, రక్షణ సహకారం వంటి కీలక అంశాలపై ఇద్దరూ చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్ తన సాయుధ బలగాలను ఆధునీకరించడానికి 2030 నాటికి 300 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నందున, రక్షణ రంగంలో సహకారం అనేది అదానీజాన్సన్ల మధ్య సమావేశ కీలకమైన అంశాలలో ఒకటని ఆ వర్గాలు తెలిపాయి. ఆత్మనిర్భర్ భారత్ చొరవలో భాగంగా ఏరోస్పేస్
రక్షణ సాంకేతికతల సహ-రూపకల్పన, అభివృద్ధి పర్చడానికి అదానీ గ్రూప్, బ్రిటిష్ కంపెనీలు ఎలా సహకరించుకోవాలనే దానిపై చర్చలు సాగాయని వివరించాయి. అదానీ గత ఏడాది అక్టోబర్‌లో లండన్‌లో జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో జాన్సన్‌ను కలిశారు. అక్కడ ఇద్దరు నాయకులు క్లీన్ ఎనర్జీకి కొనసాగుతున్న పరివర్తనపై తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. గురువారం సమావేశం తర్వాత జాన్సన్…వడోదర సమీపంలోని హలోల్ పారిశ్రామిక ప్రాంతానికి వెళ్లారు. అక్కడ బ్రిటిష్‌కు చెందిన జేసీబీ పరికరాల తయారీ ఫ్యాక్టరీని సందర్శించారు.