Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

మణిపూర్‌ తొలిదశ హింసాత్మకం

బీజేపీ, కేపీఏ మధ్య ఘర్షణలు
పోలింగ్‌ కేంద్రాల్లో కాషాయ మూకల విధ్వంసం
భారీగా పోలింగ్‌

ఇంపాల్‌ : మణిపూర్‌లో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల తొలిదశ హింసాత్మకంగా మారింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లోని 38 నియోజకవర్గాలకు సోమవారం జరిగిన పోలింగులో చాలాచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా చరచంద్‌పూర్‌ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. సింఘత్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మాక్‌ పోల్‌ సమయంలో బీజేపీ, కేపీఏ పక్షాల మధ్య ఘర్షణ చెలరేగడంతో హింస చెలరేగింది. పరస్పరం జరిగిన ఈ దాడుల్లో ఈవీఎం కూడా ద్వంసమవడంతో అధికారులు దాని స్థానంలో మరొక ఈవీఎంను ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యాకర్తలు పోలింగు బూత్‌ను ఆక్రమించి రిగ్గింగు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు లాంగ్తాబల్‌ నియోజకవర్గంలోని కక్వా ప్రాంతంలోని పోలింగ్‌ బూత్‌ను ధ్వంసం చేశారు. తూర్పు ఇంపాల్‌ జిల్లాలోని కైరావ్‌ అసెంబ్లీ బరిలో నిలిచిన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) అభ్యర్థి వాహనంపై ప్రత్యర్థి పార్టీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో ఎవరూ గాయపడకపోయినా వాహనం పూర్తిగా ధ్వంసమైంది. కాంగ్‌పోక్పి జిల్లాలోని న్యూ కెయిథెల్‌మన్బి పోలింగ్‌ స్టేషన్‌లో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడిరది. బీజేపీ కార్యకర్తలు ఈ బూత్‌ను మొత్తం ఆక్రమించారని కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆందోళన చేపట్టడంతో గందరగోళం నెలకొంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. అయినా ఆందోళనకారులు లెక్క చేయకపోవడంతో జనాలను చెదరగొట్టడానికి భద్రతా దళాలు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఎవరికి ఎటువంటి హాని జరుగలేదని ఆశాఖ వర్గాలు తెలిపాయి. తూర్పు ఇంపాల్‌ జిల్లాలోని ఫునాల్‌ మారింగ్‌ గ్రామానికి చెందిన డెన్నిస్‌ లాలియెంజుల్‌ అనే యువకుడు ఓటు వేయడానికి వెళ్లిన తరుణంలో ఆయన ఓటు ఇది వరకే నమోదైనట్టు అధికారులు తెలపడంతో ఆ ప్రాంతంలో ఆందోళన చెలరేగింది. ఈ క్రమంలో అందోళన చేపట్టిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ ట్వీట్‌ చేశారు. ఓటు వేయడానికి బూత్‌కు చేరుకున్న ఓటరు ఓటు ఏమైందని ప్రశ్నిస్తూ ఇది చాలా దారుణమైన ఘటన అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని భావించిన ఎన్నికల సంఘం పోలింగు కోసం 6,884 మంది పోలింగు సిబ్బంది సహా భారీగా పోలీసు, కేంద్ర బలగాలను వినియోగించినా పోలింగు హింసాత్మకంగా మారడంపట్ల వివిధ పార్టీలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. తొలిదశలో వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన 173 మంది అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌ సింగ్‌, మణిపూర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన్‌ లోకేష్‌ సింగ్‌, ఎన్‌పీపీ అభ్యర్థి యుమ్మనం జోయ్‌కుమార్‌, అసెంబ్లీ స్పీకర్‌ వై ఖేమ్‌చంద్‌ సింగ్‌ వంటి ప్రముఖులు ఉన్నారు. ఇక పార్టీల పరంగా చూస్తే మొత్తం 38 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో నిలువగా కాంగ్రెస్‌ పార్టీ 35, ఎన్‌పీపీ27, జేడీ (యూ) 28, శివసేన7, అథవాలే నేతృత్వంతోని ఆర్‌పీఐ6, రామ్‌విలాస్‌ నేతృత్వంతోని ఎల్‌జేపీ3, కుకీ నేషనల్‌ అసెంబ్లీ, కుకీ పీపుల్స్‌ అలయన్స్‌ పార్టీల తరపున ఇద్దరిద్దరు సహా మరో 18 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు ఎన్నికల కమిషన్‌ వెల్లడిరచింది. ఇందులో 39 మందికి నేర చరిత్ర కూడా ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్‌ అగర్వాల్‌ తెలిపారు. కాగా తొలిదశలో ఎన్నికలు జరుగుతున్న ఐదు జిల్లాలో అత్యధికంగా పశ్చిమ ఇంపాల్‌ జిల్లాలో 13 స్థానాలు, తూర్పు ఇంపాల్‌ జిల్లాలో 10 స్థానాలు, కాంగ్‌పోక్సి జిల్లాలోని ఎనిమిది స్థానాలు, బిష్ణుపూర్‌, చందన్‌పూర్‌ జిల్లాలో ఒకొక్క స్థానాల్లో పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు కంగ్‌పోక్పి జిల్లాలో అత్యధికంగా 61.30 శాతం ఓటింగ్‌ నమోదుకాగా తరువాతి స్థానంలో పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాలో 52.15 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక తూర్పు ఇంఫాల్‌లో 46.11 శాతం ఓటింగ్‌ నమోదైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img