Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

మరపురాని కాళరాత్రి

దశాబ్దాలు గడిచిన మానని గాయం తేరుకోని బాధిత కుటుంబాలు తరాలను పీడిస్తున్న రోగాలు భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనకు 37 ఏళ్లు భోపాల్‌ : యూనియన్‌ కార్బయిడ్‌ రసాయనాల కర్మాగారం నుంచి వ్యాపించిన 40 టన్నుల లీథల్‌ మిథైల్‌ ఐసోసైనేట్‌ కారణంగా భోపాల్‌లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషాదానికి 37 ఏళ్లు అయ్యాయి. మధ్యప్రదేశ్‌ రాజధాని నగరం భోపాల్‌లో 1984, డిసెంబరు 23 మధ్యరాత్రి జరిగిన ఈ దుర్ఘటన ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక విపత్తుగా నిలిచింది. దశాబ్దాలు గడిచినా మానని గాయంగా మారింది. నాటి విషవాయువుల ప్రభావంతో రోగాలు తరాలను పీడిస్తున్నాయి. నేటికి అనేక మంది తీవ్రమైన శ్వాసకోస సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు. అనేకమంది జీవితాంతం అంగవైకల్యులుగా మిగిలారు. అధికారికంగా 2,259 మంది చనిపోయినట్లు నివేదికలు వెలువడగా మరణించిన వారి సంఖ్య 20వేలకుపై మాటే అని కార్యకర్తలు అంచనా వేశారు. 37 ఏళ్ల కిందట పిల్లలుగా తాము ఎదుర్కొన్న ఈ దుర్ఘటన కారణంగా నేడు తమ పిల్లలూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ నాటి చేదు జ్ఞాపకాలను కొందరు గుర్తుచేసుకున్నారు. అది కాళరాత్రి అని అన్నారు. బతికి బట్టకట్టిన వారి తర్వాతి తరాలపైనా ఆ విష వాయువుల ప్రభావం ఉంది. అనేకమంది పిల్లలు అంగవైకల్యంతో జన్మించారు. కొందరు డ్రౌన్‌ సిండ్రోమ్‌తో బాధపడితే మరికొందరు కండరాల సమస్యలతో మంచానికి పరిమితమయ్యారు. అలాంటి వారిలో అల్ఫేజ్‌ (11 ఏళ్లు), ఉమర్‌ (13), ఈషా (19), మోసీన్‌ (25) ఉన్నారు. వీరంతా మంచానికే పరిమితం అయ్యారు. వీరు ఏ పని సొంతంగా చేసుకోలేరు. నాలుగేళ్ల అజాన్‌ సెరిబ్రల్‌ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది అతనికి వారసత్వంగా వచ్చింది. దుర్ఘటన సంభవించినప్పుడు తాను ఎనిమిది నెలల గర్భవతినని, అనంతరం కుమార్తె జన్మించగా ఆమెకు శ్వాస కోశ సమస్య ఉందని, అయితే అది ప్రమాదకరమైనదేమీ కాదని అజాన్‌ అమ్మమ్మ చెప్పారు. కోవిడ్‌ కారణంగా వీరి వెతలు మరింత పెరిగాయి. వరుస లాక్‌డౌన్‌లు, ఆంక్షలు అమలు కావడంతో సమయానికి వైద్యం అందక అజాన్‌ లాంటి అనేకమంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారానికి ఒకసారి ఇంటికి రావడం లేదా వీడియో కాల్స్‌ ద్వారా చింగారీ ట్రస్ట్‌ థెరపిస్టులు వారికి అండగా నిలిచారు. ఏడీహెచ్‌డీతో బాధపడే అల్ఫేజ్‌ ఒంటరిగా జీవిస్తున్నాడు. ఎందుకంటే అతనిని ఎక్కువ మంది అర్థం చేసుకోలేరు. ఏడాది పిల్లవాడిని వైద్యుని వద్దకు తీసుకెళ్లగా కుటుంబంలో ఎవరైనా గ్యాస్‌ దుర్ఘటన బాధితులు ఉన్నారా అని ఆయన అడిగారని అల్ఫేజ్‌ తల్లి తరన్నం తెలిపారు. ఆరా తీయగా అల్ఫేజ్‌ తండ్రి ఏడాదిన్నర పిల్లవాడిగా విషవాయువులను పీల్చినట్లు తెలిసి ఏమీ చేయలేమని డాక్టర్‌ చెప్పారన్నారు. డ్రౌన్‌ సిండ్రోమ్‌తో బాధపడే ఉమెయిర్‌ అహ్మద్‌ (13) తండ్రి తన నాలుగేళ్ల వయస్సులో విషవాయువులను పీల్చారు. దీంతో ఉమెయిర్‌ నేడు నయం కాని రోగంతో బాధపడుతున్నాడు. ఇలాంటి కేసులు అనేకం ఉన్నాయి. దీనికి ముగింపు ఎప్పుడన్నది నేటికీ సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. 37 ఏళ్ల తర్వాత కూడా ఆ కాళరాత్రి చెయిన్‌ తెగలేదని నిపుణులు అంటున్నారు. దీని పరిష్కారం కోసం నిపుణులు కృషిచేస్తూనే ఉన్నారు. ఏటా ఈ రోజును గుర్తుచేసుకోవడం ఆచారంగా మారిందిగానీ తమ సమస్యలు పరిష్కారమయ్యేది ఎప్పుడు అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. పాలకులు తగిన చర్యలు తీసుకుంటే తమ భవిష్యత్‌ తరాలు కాస్తంత ఉపశమనం పొందగలవని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img