Friday, August 12, 2022
Friday, August 12, 2022

ముంబైలో ప్రమాద ఘంటికలు: 8.4 శాతానికి పాజిటివిటీ..

మహారాష్ట్రలో 4 నెలల తర్వాత వెయ్యికిపైగా కరోనా కేసులు
ముంబైలో మరోసారి కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పెరుగుతున్న కేసుల్లో కొవిడ్‌ లక్షణాలు కనిపించేవి ఎక్కువగా ఉంటున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం 6 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. బుధవారానికి ఏకంగా 8.4 శాతానికి చేరుకుంది. మహారాష్ట్రలో మూడు నెలల తర్వాత రోజువారీ కేసులు 1,000కి నమోదుకాగా.. ఇందులో ఒక్క ముంబై నుంచే 700కిపైగా ఉన్నాయి. నాలుగు నెలల తర్వాత ముంబయిలో ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయి. బుధవారం ముంబయిలో 739 మందికి కొత్తగా వైరస్‌ నిర్ధారణ అయ్యింది. మహారాష్ట్రలో మొత్తం 1,081 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఫిబ్రవరి 24 తర్వాత (1,182 కేసులు) ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే మొదటిసారి. అయితే, మరణాలు లేకపోవడం ఊరట కలిగించే అంశం. ముంబైలో కేసులు పెరుగుతుండటంతో బీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. టెస్ట్‌ల సంఖ్యను పెంచాలని ల్యాబ్‌లకు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌ బాధితుల చికిత్సలకు ఆస్పత్రులు సన్నద్ధంగా ఉండాలని.. ఆ మేరకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1 తర్వాత ఆ స్థాయిలో అత్యధిక కేసులు బుధవారం నమోదయ్యాయని పేర్కొన్నారు. ఎక్కువ కేసులు కోవిడ్‌ లక్షణాలు ఉన్నవేనని హెచ్చరించారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా కేసులు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని మహారాష్ట్ర అదనపు చీఫ్‌ సెక్రెటరీ డాక్టర్‌ ప్రదీప్‌ వ్యాస్‌ తెలిపారు. ‘‘ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరడం.. కోవిడ్‌ నిబంధనలు పాటించడంలో అలసత్వం.. మాస్క్‌లు ధరించకపోవడం వంటివి కొన్ని కారణాలు. ఒమిక్రాన్‌ ఉప- వేరియంట్‌లు కూడా కారణం కావచ్చు’’ అని అన్నారు. ఇప్పటి వరకూ ఈ వేరియంట్‌ కేసులు మహారాష్ట్రలో ఏడు నిర్ధారణ కాగా.. బాధితులంతా పుణేకు చెందినవాళ్లే. చాలా మంది జ్వరం, జలుబు వంటి కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నా పరీక్షలు చేయించుకోవడం లేదని వ్యాస్‌ పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో బుధవారం 29 మంది కోవిడ్‌ బాధితులు చేరగా.. 24 గంటల్లో యాక్టివ్‌ కేసులు 20 శాతం మేర పెరిగాయి. యాక్టివ్‌ కేసులు అధికంగా ముంబయి, థానే, పుణేలోనే ఉన్నాయని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్‌ తోపే తెలిపారు. మొత్తం 4,032 యాక్టివ్‌ కేసులుండగా.. ఒక్క ముంబయిలోనే 2,970 ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img