న్యూదిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ర్యాలీల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. యూపీలోని ప్రతి ఒక్కరూ బీజేపీ ‘జుమ్లా’ (వాక్చాతుర్యం) రాజకీయాలను అర్థం చేసుకున్నారన్నారు. ర్యాలీల కోసం జనాన్ని సేకరించేందుకు అధికారులు ప్రజానిధులను కోరుతున్నారన్న ప్రియాంక, దీనిపై మీడియా నివేదికల క్లిప్పింగ్‌లను ట్విట్టర్లో పంచుకున్నారు. లాక్డౌన్ సమయంలో లక్షలాది మంది కార్మికులు దిల్లీ నుండి ఉత్తరప్రదేశ్‌లోని తమ గ్రామాలకు కాలినడకన తిరిగి వస్తున్నప్పుడు బీజేపీ ప్రభుత్వం వారికి బస్సులు కూడా ఏర్పాటు చేయలేదు కానీ ప్రధానమంత్రి, హోంమంత్రి ర్యాలీలకు జనాలను రప్పించేందుకు మాత్రం ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోందని ఆమె ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి గ్రామంలో బీజేపీ పాలనపై తీవ్ర ఆగ్రహం ఉందని ప్రియాంక పేర్కొన్నారు.