Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

యూపీలోనే కాదు

బీజేపీకి గుజరాత్‌లోనూ ఓటమి తప్పదు : అఖిలేష్‌ యాదవ్‌
ఘజియాబాద్‌ : యూపీ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయం బీజేపీకి కూడా స్పష్టంగా తెలుసునని పేర్కొన్నారు. శనివారం రాష్ట్రీయ లోక్‌ దళ్‌ అధినేత జయంత్‌ చౌదరితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరమైనవి కాదని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో జరుగనున్న గుజరాత్‌ ఎన్నికల్లో అత్యంత ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉండనున్నాయని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటికే తమ తీర్పును ఇచ్చారని పేర్కొన్నారు. రైతులు, యువత, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల ప్రజలు సమాజ్‌వాదీ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తేల్చి చెప్పారని పేర్కొన్నారు. యూపీ ఎన్నికల అనంతరం జరిగే గుజరాత్‌ ఎన్నికల్లో గాంధీ హంతకులను గౌరవిస్తున్న వారికి ఎన్నికల సమయంలో అక్కడి ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఎన్నికలున్నాయనే రైతు చట్టాలను కేంద్రం రద్దు చేసిందని తెలిపారు. అయినా అన్నదాతలను బీజేపీ అవమానించిన విషయాన్ని రైతాంగం ఎలా మరిచిపోతుందని పేర్కొన్నారు. జయంత్‌ చౌదరి పార్టీతో పోత్తు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చౌదరి చరణ్‌ సింగ్‌ రైతుల పక్షాన చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ ఆ వారసత్వంతో తామిద్దరం అన్నదాతల కోసం పోరాడుతున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img