Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

యూపీలో మరణమృదంగం

వింతవ్యాధులతో 60మందికి పైగా మృతి
మృతుల్లో అత్యధికులు చిన్నారులే
ఐసీఎంఆర్‌ బృందం రాక
యోగి ప్రభుత్వం అప్రమత్తం
లక్నో :
డెంగీతో పాటు వింత వ్యాధులు ఉత్తరప్రదేశ్‌ను కలవర పెడుతున్నాయి. ఇప్పటికే ఫిరోజాబాద్‌ జిల్లాలో తీవ్ర జ్వరంతో 50 మందికి పైగా మరణించగా, మథురలో మరో కొత్తరకం వ్యాధితో పదిమందికి పైగా మరణించాడు. మృతుల్లో అత్యధికులు చిన్నపిల్లలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారుల మృతిపై యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య సేవలపై దృష్టి సారించింది. చిన్నారుల మరణాల నియంత్రణకు పటిష్టచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. యూపీలోని ఫిరోజాబాద్‌ జిల్లాలో తీవ్ర జ్వరంతో 32 మంది పిల్లలు సహా 41 మంది మరణించడం కలకలం రేపుతోంది. దీనికి డెంగీనే కారణం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో ఫిరోజాబాద్‌ జిల్లా ప్రధాన వైద్యాధికారి నీతా కుల్‌శ్రేష్ఠ్‌ను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. ఆమెను అలీగఢ్‌ మల్‌ఖాన్‌ సింగ్‌ జిల్లా ఆసుపత్రికి సీనియర్‌ కన్సల్టెంట్‌గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బదిలీ ఎందుకు చేశారన్న విషయంపై స్పష్టత లేదు. మరోవైపు ఫిరోజాబాద్‌లో ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు దిల్లీ ఐసీఎంఆర్‌ నుంచి 11 మంది నిపుణుల బృందం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, మథురలో మరో కొత్త రకం వ్యాధి వ్యాప్తి చెందుతూ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ చాలా మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారని తెలుస్తోంది. దీన్ని స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధిగా వైద్యులు గుర్తించారు. మథుర జిల్లా మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రచన గుప్తా మాట్లాడుతూ ఒక్క కోప్‌ా గ్రామంలోనే 26 మంది స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. పిప్రోత్‌లో ముగ్గురు, రాల్‌లో 14, జసోడాలో 17 మందికి ఈ వ్యాధి సోకిందన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే పది మంది మరణించగా.. ఇందులో 8 మంది చిన్నారులు ఉన్నట్లు నివేదికలు అందాయని వివరించారు. ఉత్తరప్రదేశ్‌కు పశ్చిమంగా ఉన్న ఆగ్రా, ఫిరోజాబాద్‌, మెయిన్‌పురి, ఎటా, కస్గంజ్‌ జిల్లాల్లో వ్యాధి సోకి మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల నుంచి అధికారులు నమూనాలు సేకరిస్తున్నారని వెల్లడిరచారు. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రకారం స్క్రబ్‌ టైఫస్‌ అనేది ఓరియెంటియా త్సుత్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. చిగ్గర్స్‌ అనే పురుగు కాటు ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. దీన్ని ‘ష్రబ్‌ టైఫస్‌’ అని కూడా పిలుస్తారు. చిగ్గర్స్‌ కాటుకు గురైన వారిలో ముందు 10రోజుల వరకు విపరీతమైన జ్వరం, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, ఒళ్లంతా దద్దుర్లు పుట్టడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి నివారణకు ఎటువంటి టీకాలు అందుబాటులో లేవని సీడీసీ తెలిపింది. వ్యాధి బారిన పడిన వారి నుంచి దూరంగా ఉండాలని చెప్పింది. చిగ్గర్స్‌ ఎక్కువగా చెట్ల పొదలు ఉన్న ప్రాంతంలో సంచరిస్తుంటాయని, ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండడమే మంచిదని పేర్కొంది. చిన్నారుల శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వాడాలని సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img