అమిత్‌షా స్వోత్కర్ష
బెహ్రెయిచ్ : ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు భేష్ అంటూ యోగి ప్రభుత్వాన్ని కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా గురువారం ప్రశంసించారు. ఎక్కడ కూడా ఏ ‘బాహుబలి’ టెలిస్కోప్ వాడుతూ కనిపించడం లేదని, ఎక్కడ చూసినా ‘బజరంగ్‌బలీ’లే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన ఎస్పీ, ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌పై విమర్శలు గుప్పించారు. నల్ల కళ్లాద్దాలు పెట్టుకున్నందునే రాష్ట్రంలోని మెరుగుపడ్డ శాంతిభద్రతల పరిస్థితి ఆయనకు కనిపించలేదని అఖిలేశ్‌నుద్దేశించి అన్నారు. యోగి ముఖ్యమంత్రి అయ్యాక మాఫియాను తుడిచిపెట్టారని, 2017 ఎన్నికల్లో హామీనిచ్చినట్లుగా శాంతిభద్రతలను మెరుగుపర్చారన్నారు. ఆజం ఖాన్, అతీక్ అన్సారీ, ముక్తార్ అన్సారీ ఇప్పుడు జైల్లో ఉన్నారని, పొరపాటున సైకిల్ గుర్తుకు ఓటేస్తే వారు బయటకు వచ్చి మరలా ఇబ్బంది పెడతారన్నారు. వాళ్లు జైల్లోనే ఉండాలంటే బీజేపీ, యోగికి ఓటు వేసి రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు బాహుబలీల నుంచి విముక్తి కల్పించండని ప్రజలను కోరారు. అఖిలేశ్‌పై విమర్శలు చేస్తూ వాళ్లు పేరుకు మాత్రమే సమాజ్‌వాదీలు, కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు. ఒకటే కుటుంబానికి చెందిన 45 మంది వేర్వేరు పదవుల్లో ఉన్నారన్నారు. 300కుపైగా స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, ఎస్పీ, బీఎస్పీ తుడిచిపెట్టుకుపోయాయని అమిత్‌షా అన్నారు. కాగా, 27న ఐదవ దశ పోలింగ్ జరగనుంది.