మతవాదులకు ఓట్లు పడవు
రాకేశ్ తికైత్
లక్నో : రైతుల సంక్షేమం కోసం కృషి చేసే వారి వైపే యూపీ ఓటర్లు మొగ్గు చూపుతారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికైత్ అన్నారు. హిందూ ముస్లిం అంటూ మత ప్రస్తావనలు చేస్తూ ఓటర్లను మభ్యపెట్టాలని చూసే వారికి ఈ ఎన్నికల్లో ఏ ప్రయోజనాలు దక్కవని స్పష్టం చేశారు. అన్నదాతలు తాము పండిరచిన పంటలకు మద్దతు ధర లభించక, విద్యుత్ బిల్లుల భారాన్ని భరిస్తూ సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమ సమస్యల పరిష్కారం కోసం పని చేసే పార్టీ వైపు ఎన్నికల్లో మొగ్గు చూపుతారని తేల్చి చెప్పారు. ప్రజలను పట్టిపీడిస్తున్న నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల గురించి మాట్లాడకుండా పాకిస్థాన్, జిన్నా అంటూ అసందర్భ ప్రకటనలతో ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూసేవారికి తగిన బుద్ది చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తాను రాజకీయ నేతను కాదని ఏ పార్టీ గెలుస్తుందో వ్యాఖ్యానించలేనని పేర్కొన్నారు. అయితే అన్నదాతల సమస్యలపై నిలదీస్తానని, ప్రజలు కూడా పార్టీల నేతలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అన్ని సమస్యలను పక్కకు నెట్టి హిందూ-ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే వారికి తగిన రీతిలో సమాధానం చెప్పాల్సిందేని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్నదాతలు తాము ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు తమ పిల్లలకు ఇబ్బందికరంగా మారిన నిరుద్యోగం వంటి ఇతర సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేస్తారని తాను విశ్వసిస్తున్నట్టు తెలిపారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తరుణంలో చెప్పినట్టు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా అనే ప్రశ్నపై స్పందించిన ఆయన ఇప్పుడు అటువంటి ప్రణాళికలు తనముందు లేవని చెప్పారు. కేవలం రైతుల సమస్యలపైనే మాట్లాడతానని, పోరాటం చేస్తానని తెలిపారు. రైతాంగ సమస్యలపై నేతలను ప్రశ్నించేలా అన్నదాతలను చైతన్యపరుస్తానని వివరించారు.