Friday, December 1, 2023
Friday, December 1, 2023

రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదు

కేంద్రం ఎంఎస్‌పీపై చట్టం చేయాలి
మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌

ముజఫర్‌నగర్‌ (ఉత్తర ప్రదేశ్‌) : కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై ఒక చట్టం చేయాలని మేఘాలయ గవర్నర్‌ సత్య పాల్‌ మాలిక్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాలిక్‌, రైతులు దిల్లీ సరిహద్దుల్లో మాత్రమే తమ ధర్నాను ముగించారని, కానీ మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వారి ఉద్యమం ఇప్పటికీ సజీవంగానే ఉందని తెలిపారు. ‘ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ఎంఎస్‌పీపై ఒక చట్టాన్ని చేయాలి’ అని ఆదివారం సాయంత్రం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మాలిక్‌ అన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ నవంబర్‌ 2020లో దిల్లీ సరిహద్దుల్లో పంజాబ్‌, హరియాణా నుంచి వేలాది మంది రైతులు సుదీర్ఘ ఆందోళన నిర్వహించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత డిసెంబర్‌ 2021లో రైతులు తమ నిరసనలను ముగించారు. తమపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, ఎంఎస్‌పీపై చట్టపరమైన హామీ ఇవ్వాలని, నిరసన సమయంలో మరణించిన రైతుల బంధువులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో నిరసన తెలిపిన రైతులు నిరసన స్థలాలను వీడి వెళ్లేందుకు నిరాకరించారు. గత ఏడాది డిసెంబర్‌ 9న కేంద్రం తమ ఇతర డిమాండ్లను పరిశీలించేందుకు అంగీకరించిన తర్వాత ఆందోళన విరమిస్తున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ప్రకటించింది. గవర్నర్‌ మాలిక్‌ మాట్లాడుతూ ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై చర్చలు జరగలేదని, దేశంలోని యువత ఉద్యోగాలు లేకుండా రోడ్లపై తిరుగుతున్నారని అన్నారు. ముఖ్యమైన అంశాలకు బదులుగా, ‘అనవసరమైన’ విషయాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. హిందువులు, ముస్లింలు పోరాటాన్ని ఆపాలని ఆయన కోరారు. నిరుద్యోగం, దేశం ఎదుర్కొంటున్న ఇతర కీలక సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించాలని అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో బుల్డోజర్ల గురించి మాట్లాడుతూ, సమయం ఇవ్వకుండా పేదల ఇళ్లను కూల్చి వేయకూడదని తెలిపారు. ఇక్కడి బాగ్రా దర్గాను మాలిక్‌ సందర్శించారు. అలాగే రాష్ట్రీయ లోక్‌ దళ్‌, సమాజ్‌వాది పార్టీ నాయకులను కలిశారు. రైతుల ఆందోళన ఉధృతంగా ఉన్న సమయంలో మాలిక్‌ రైతులకు అనుకూలంగా మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. మార్చిలో మాలిక్‌ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించవద్దని తన స్నేహితులు తనకు సలహా ఇచ్చారని, తాను మౌనంగా ఉంటే రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతిని కావచ్చని, అయితే ‘ఈ పదవుల గురించి తాను పట్టించుకోనని’ నొక్కి చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img