Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

రైల్వేస్టేషన్లా..ఎయిర్‌పోర్టులా?

కొత్త నిబంధనలతో ప్రయాణికులకు ఇక్కట్లు
కరోనా టెస్టుల్లో కాలయాపన
రిపోర్టుల కోసం ఎదురుతెన్నులు
కరోనా నిబంధనలు గాలికి

న్యూదిల్లీ : పండగల వేళ రైల్వేస్టేషన్‌లు, బస్‌స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా వుండటం సాధారణమే కానీ ఇప్పుడు విమానాశ్రయాల్లో ఆ పరిస్థితి నెలకొంది. దేశంలో కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్రప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. దీంతో విమానాశ్రయాల్లో రద్దీ పెరుగుతోంది. ఫలితంగా కరోనా నిబంధనలు గాలికొదిలే పరిస్థితులు తలెత్తుతున్నాయి. విదేశాల నుంచి ముఖ్యంగా ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు. దీంతో పరీక్షలు చేయించుకుని ఫలితం తెలుసుకునే వరకు ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దేశ రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు అక్కడి అధికారులు రెండు అవకాశాలు కల్పించారు. ఒకటి.. సాధారణ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష. దీనికి రూ.500 వసూలు చేస్తున్నారు. ఈ పరీక్ష ఫలితం రావాలంటే ప్రయాణికులు 6-8 గంటలు ఎదురుచూడాల్సి వస్తోంది. ఇక రెండోది.. ర్యాపిడ్‌ పీసీఆర్‌ టెస్ట్‌. దీని ధర రూ.3,500. రెండు గంటల్లో ఫలితం వస్తుంది. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష ఫలితానికి చాలా సేపు పడుతుండటంతో ఖర్చు ఎక్కువైనా ప్రయాణికులు ర్యాపిడ్‌ టెస్టులు చేయించుకుంటున్నారు. అయితే దీని ఫలితం కోసం కూడా రెండు గంటల సమయం ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్‌ డెస్కుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇక, పరీక్షల కోసం పెద్ద పెద్ద క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిల్లీ ఎయిర్‌పోర్టులో ఆదివారం నాటి దృశ్యాలను కొందరు ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో పంచుకున్నారు. కరోనా నిబంధనలు పక్కనబెడితే.. ఈ పరిస్థితులతో ఎయిర్‌పోర్టులే హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇందులో ప్రయాణికులు కనీస నిబంధనలైన మాస్క్‌లు, భౌతిక దూరాన్ని పాటించకపోవడం కలవరపెడుతోంది. ఈ నిబంధనలు ఒమిక్రాన్‌ కట్టడికా? ఆహ్వానానికా? అన్నట్లుగా ఉంది. ప్రయాణికులకు వైరస్‌ పరీక్షల కోసం దిల్లీ ఎయిర్‌పోర్టులో కొత్తగా 20 కౌంటర్లను తెరిచినట్లు అధికారులు వెల్లడిరచారు.
రద్డీ నియంత్రణకు మంత్రి ఆదేశం
కొత్త ప్రయాణ మార్గదర్శకాల అమలుతో టెర్మినల్‌లో గందరగోళం, రద్దీ చోటుచేసుకోవడంపై ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో రద్దీ లేకుండా సరైన వ్యూహాలను అమలు చేయాలని విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం దిల్లీ విమానాశ్రయ ఆపరేటర్‌ డీఐఏఎల్‌ని ఆదేశించారు. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ జీఎంఆర్‌ గ్రూప్‌ నేతృత్వంలోని దిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (డీఐఏఎల్‌) అధికారులతో మంత్రి సోమవారం సమావేశమయ్యారు. దిల్లీ విమానాశ్రయంలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షను నిర్వహించే ఏకైక ప్రయోగశాల అయిన జెనెస్ట్రింగ్స్‌ డయాగ్నోస్టిక్స్‌ అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెరుగైన క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ వ్యూహాలను అమలు చేయాలని మంత్రి డీఐఏఎల్‌ను ఆదేశించారు. డిసెంబరు 1న కొత్త ప్రయాణ నిబంధనలు ప్రారంభమైన తర్వాత దిల్లీ విమానాశ్రయంలో పరిస్థితిపై కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం శనివారం ‘నేను భయపడి హెచ్చరించినట్లుగానే విమానాశ్రయాలలో గందరగోళం, రద్దీ నెలకొంది’ అని ట్వీట్‌ చేశారు. అనేకమంది ప్రయాణికులు దిల్లీ విమానాశ్రయంలో బారులు తీరిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img