కోవిడ్ కాలంలో టికెట్లపై రాయితీలు కట్
ప్రత్యేకం పేరిట అధిక వసూళ్లు
4కోట్ల మంది వృద్ధులకు తప్పని అదనపు భారం
న్యూదిల్లీ : కరోనా మహమ్మారి భారత్‌లో ఉగ్రరూపం దాల్చడంతో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ను విధించిన క్రమంలో రైల్లే సేవలు సైతం నిలిచిపోయాయి. ఆపై కొద్ది కాలానికి ప్రత్యేక రైళ్లను నడిపిన రైల్వేశాఖ టికెట్ ధరలను పెంచేసింది. ఉన్న రాయితీలన్నీ ఎత్తివేసింది. దీంతో నాలుగు కోట్ల మంది వృద్ధులకు రైల్వే బాదుడు తప్పలేదు. కోవిడ్ కారణంగా 2020 మార్చి నుంచి రైల్వే ప్రయాణాలపై అన్ని రకాల రాయితీలను ఎత్తివేయడంతో సీనియర్ సిటిజన్లు తమ టికెట్ ధరను పూర్తిగా చెల్లించాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ఆర్టీఐ వెల్లడిరచింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది. 2020 మార్చి 22 నుంచి 2021 సెప్టెంబరు వరకు 37,850,668 మంది వృద్ధులు ఎలాంటి రాయితీలు లేకుండా రైళ్లల్లో ప్రయాణించినట్లు తెలిపింది. సీనియర్ సిటిజన్స్‌లో మహిళల (68ఏళ్ల)కు 50శాతం, పురుషుల (60ఏళ్లు)కు 40శాతం చొప్పున రైల్వేలోని అన్ని తరగుతల టికెట్లపై రాయితీ లభిస్తుంది. రైల్వే కల్పించే రాయితీలపై రెండు దశాబ్దాలుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వాటిని ఉపసంహరించుకోవాలని చాలా కమిటీలు సూచించాయి. పర్యవసానంగా 2016 జులైలో టికెట్ బుకింగ్‌లో వృద్ధులకిచ్చే రాయితీని ఆప్షనల్‌గా ఉంచారు. తమకు లభించే పాక్షిక లేదా పూర్తి రాయితీని స్వచ్ఛందంగా వదులుకోవాలని 2017 జులైలో వృద్ధులకు రైల్వే పిలుపునిచ్చింది. దేశ వృద్ధుల్లో దాదాపు 20శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నేపథ్యంలో ఆదాయం లేక వారు రైళ్ల టికెట్ చార్జీలను భరించే స్థితి లేదు. కాబట్టి సీనియర్ సిటిజన్స్‌కు ఇచ్చే రాయితీని పునరుద్ధరించాలని కోరుతూ మధురై ఎంపీ వెంకటేశన్ గతనెలలో కేంద్ర రైల్వేమంత్రికి లేఖ రాశారు. రాయితీని వదులకోవాలని రైల్వే ఇచ్చిన పిలుపునకు సీనియర్ సిటిజన్ల నుంచి స్పందన పెద్దగా లేదని 2019 కాగ్ నివేదిక వెల్లడిరచింది. మొత్తం 4.41 కోట్ల మంది వృద్ధ ప్రయాణికుల్లో 1.7శాతం అంటే 7.53 లక్షల మంది 50శాతం రాయితీని వదులుకునేందుకు అంగీకరించగా 2.47శాతం అంటే 10.9లక్షల మంది పూర్తి రాయితీని వదులుకునేందుకు సంసిద్ధత కనబర్చినట్లు తెలిపింది. కోవిడ్ కారణంగా రద్దు చేసిన సేవలన్నింటిని ఒక్కొక్కటిగా ఈ పది రోజుల్లో రైల్వే పునరుద్ధరిస్తుంది. రైళ్ల పేర్లలో ‘స్పెషల్’ను తొలగించి పాత పేర్లతో నడిపే క్రమంలో టికెట్ ధరలనూ తగ్గించి, వేడి భోజనాన్ని ప్రయాణికులకు అందించాలని నిర్ణయించింది. అయితే రాయితీల పుపనరుద్ధరణ, స్లీపర్‌లో దుప్పట్లు ఇవ్వడంపై నిర్ణయం మాత్రం పెండిరగ్‌లోనే ఉంది. ఇదిలావుంటే, తన తల్లిదండ్రులు రెండేళ్లుగా తమ ఇంటికి రాలేదని, మనవళ్లను చూడలేదని, టికెట్లు కొనే స్థోమత లేక ఈ ఏడాది కూడా వారు రాలేకపోగా తానూ ఏమీ చేయలేని పరిస్థితి అని నోయిడాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే సుభాష్ సింగ్ వాపోయారు. తన తల్లిదండ్రులు వయస్సు మళ్లినవారని, బీహార్‌లో ఉంటారని అన్నారు. వృద్ధులతో కలిసి ప్రయాణించడాన్ని భారంగా భావించే చాలా కుటుంబాలు దేశంలో ఉన్నాయని, అలాంటి కుటుంబాల్లోని వృద్ధులకు ఇలాంటి రాయితీలు ప్రయోజనకారిగా ఫలిస్తాయని, టికెట్టు తక్కువగా ఉంటే కుటుంబాలతో కలిసి ప్రయాణించే ఆస్కారం ఆ వృద్ధులకు ఉంటుందని, చాలా మందికి ఆదాయం లేక టికెట్లను కొనలేరని తన భార్యతో కలిసి ఇటీవల కోల్‌కతాకు వెళ్లనున్న రిటైర్ట్ ప్రైవేటు ఉద్యోగి తాపస్ భట్టాచార్య అన్నారు. రైల్వేలో వృద్ధులకు ఇచ్చే రాయితీలను పునరుద్ధరించడం ఎంతైనా అవసరమన్నారు.