లైంగికదాడి నుంచి తప్పించుకోలేనప్పుడు..దాన్ని ఆనందించడమే ఉత్తమమంటూ కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో ఆయన తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రమేశ్ కుమార్ క్షమాపణలు కోరుతూ.. అత్యాచారం గురించి నిర్లక్ష్యపూరిత, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. చాలా హేయమైన ఆ నేరం గురించి తానేమీ నవ్వులాటగా మాట్లాడలేదని, అనాలోచితంగా వ్యాఖ్యలు చేసినట్లు ఆయన అన్నారు. ఇక నుంచి తాను జాగ్రత్తగా మాట్లాడనున్నట్లు రమేశ్ కుమార్ తెలిపారు. గురువారం కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభలో ఆందోళన చేస్తున్న సభ్యుల గురించి స్పీకర్ ప్రస్తావించిననప్పుడు. వెంటనే రమేశ్‌కుమార్ స్పందిస్తూ, ‘ఒక సామెత ఉంది. లైంగికదాడి అనివార్యమైనప్పుడు, ఆనందంగా దాన్ని ఆస్వాదించాలి. మీరు ఉన్న స్థితి కూడా సరిగ్గా అదే’ అని అన్నారు. శాసనసభలో ఈ వ్యాఖ్యలను ఖండిరచకుండా స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి పగలబడి నవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవి చాలా విచారకరమైన, దురదృష్టకరమైన వ్యాఖ్యలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖశర్మ అన్నారు. మహిళల పట్ల చిన్నచూపు చూసే ప్రజా ప్రతినిధులు ఉండటం బాధాకరమన్నారు. దీనిపై సుమోటోగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.