‘ఉపా’ కేసులో త్రిపుర పోలీసులకు సుప్రీం ఆదేశం
జర్నలిస్టు, ఇద్దరు పౌర సమాజ సభ్యులకు ఉపశమనం
న్యూదిల్లీ : ‘ఉపా’ కేసులో జర్నలిస్టు సహా ముగ్గురు పౌర సమాజ సభ్యులకు ఉపశమనం లభించింది. రాష్ట్రంలో మైనార్టీ వర్గం లక్ష్యంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై సోషల్ మీడియా పోస్టుల ద్వారా వాస్తవాలను వెలుగులోకి తెచ్చినందుకు కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు(నిరోధక) చట్టం`1967 నిబంధనల కింద దాఖలయిన ఒక కేసులో జర్నలిస్టు సహా ముగ్గురు పౌర సమాజ సభ్యులకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్బంధ చర్యలు చేపట్టవద్దని సుప్రీం కోర్టు బుధవారం త్రిపుర పోలీసులను ఆదేశించింది. త్రిపుర పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్కు వ్యతిరేకంగా జర్నలిస్టు శ్యామ్ మీరా సింగ్, న్యాయవాదులు ముఖేష్, అన్సరుల్ హఖ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎస్.బొప్పన్న, హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం అగర్తలా పోలీసులకు ఒక నోటీసు జారీ చేసింది. కాగా నిజనిర్ధారణ కమిటీలో భాగంగా ఉన్న ముగ్గురు సభ్యులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచనం అస్పష్టంగా, విస్తృతంగా ఉందని, అంతేకాకుండా చట్టం నిందితులకు బెయిల్ పొందడం కష్టతరం చేస్తోందని పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)కు చెందిన కొన్ని నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేశారు. ‘త్రిపుర మండుతోంది’ అంటూ పౌర సమాజ సభ్యుల్లో ఒకరు చేసిన ట్వీట్‌పై ఎఫ్ఐఆర్ నమోదయింది. ఇటీవల బంగ్లాదేశ్‌లో దుర్గాపూజ సందర్భంగా హిందూ మైనారిటీలపై దైవదూషణ ఆరోపణలపై దాడి చేసినట్లు నివేదికలు వెలువడిన తర్వాత ఈశాన్య రాష్ట్రంలో దహనం, దోపిడీ, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. నవంబర్ 11న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వినతిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ముగ్గురు పౌర సమాజ సభ్యులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలనే పిటిషన్‌ను విచారణ చేయడానికి అంగీకరించింది. సామాజిక మాధ్యమాల్లో వారి పోస్టులపై ఉపా కింద జర్నలిస్టు, ఇద్దరు న్యాయవాదులపై త్రిపుర పోలీసులు కేసు నమోదు చేశారని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు. వారికి సీఆర్పీసీ కింద నోటీసు జారీ చేసినట్లు వివరించారు. అక్టోబర్‌లో త్రిపురలో ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా లక్ష్యిత రాజకీయ హింస, అదే సమయంలో పబ్లిక్ డొమైన్లో లక్ష్యిత హింసకు సంబంధించిన వాస్తవాలను వెలికితీసే ప్రయత్నం చేసిన జర్నలిస్టులు, న్యాయవాదులు సహా పౌర సమాజ సభ్యులకు వ్యతిరేకంగా ఉపా నిబంధనలను అమలు చేయడం ద్వారా ప్రభావిత ప్రాంతాల నుంచి వాస్తవాలు, సమాచార ప్రవాహాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఆ పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో మత హింస గురించి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ‘ఉపా’ నిబంధనలు, ఐపీసీ కింద పశ్చిమ అగర్తలా పోలీసు స్టేషన్లో దాఖలయిన కేసులో ముగ్గురు వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. ‘వాస్తవాన్ని కనుగొనడం, నివేదించడం వంటి చర్యను నేరంగా పరిగణించడానికి రాష్ట్రాన్ని అనుమతించినట్లయితే, ‘ఉపా’ కఠిన నిబంధనల ప్రకారం ముందస్తు బెయిల్ నిషేధిస్తే, పౌర సమాజంలోని సభ్యుల వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం కారణంగా రాష్ట్రానికి అనుకూలమైన వాస్తవాలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో వస్తాయి’ అని పిటిషన్లో పేర్కొన్నారు. దైవదూషణ ఆరోపణలపై దుర్గాపూజ సందర్భంగా హిందూ మైనారిటీలపై హింస గురించి బంగ్లాదేశ్ నుండి నివేదికలు వెలువడిన తర్వాత త్రిపుర రాష్ట్రంలోని రాజకీయ మితవాద శక్తులు ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా మతపరమైన భావాలను రెచ్చగొట్టడం ప్రారంభించాయని వివరించింది.