Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

విషప్రచారానికి పాల్పడితే కఠినచర్యలు

కేరళ సీఎం విజయన్‌ హెచ్చరిక
తిరువనంతపురం : రాష్ట్రంలో మతసామరస్యకు విఘాతం కలిగించే లక్ష్యంతో విష ప్రచారానికి పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గురువారం తీవ్రంగా హెచ్చరించారు. ఎంతటివారైనా సహించేది లేదని స్పష్టంచేశారు. సమాజంలో అశాంతి సృష్టించే శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఉన్నతస్థాయి అధికారులను ఆదేశించారు. విభజన రాజకీయాలు, ప్రజల్లో విద్వేషాలు సృష్టించేవారిని ఏమాత్రం క్షమించవద్దని విజయన్‌ స్పష్టం చేసినట్లు సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. విజయన్‌ అధ్యక్షతన గురువారం అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. పాలా బిషప్‌ జోసెఫ్‌ కల్లరంగట్‌ ఇటీవల చేసిన వివాదాస్పద నార్కోటిక్‌ జిహాద్‌ వ్యాఖ్యలుపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి విజయన్‌ ప్రకటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. బిషప్‌ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు, సాంస్కృతిక సామాజిక నేతలు తీవ్రంగా స్పందించిన విషయం విదితమే. బిషప్‌ వ్యాఖ్యలను ఉపయోగించుకొని కొన్ని స్వార్ధపర శక్తులు సమాజ విభజనకు, మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని, ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆందోళన వెలిబుచ్చింది. లౌకిక సంప్రదాయాలు, మతసామరస్యత, సోదరతత్వానికి కేరళ ప్రతీకగా నిలిచిందని విజయన్‌ గుర్తుచేశారు. ఇలాంటి రాష్ట్రంలో కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఆ శక్తుల ఆగడాలను సహించేది లేదని, కఠినచర్యలు తీసుకుంటామని సీఎం హోచ్చరించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారమయ్యే ఇలాంటి విషప్రచారంపై ప్రత్యేకదృష్టి కేంద్రీకరించాలని అధికారులకు సీఎం విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీపీ జాయ్‌, హోంశాఖ కార్యదర్శి కె.జోస్‌, డీజీపీ అనిల్‌కాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img