వారి కష్టం తీర్చేది ఎప్పుడు..?
నిరసనోద్యమంలో 700 మంది రైతుల ప్రాణత్యాగం
అధిక శాతం పేద కుటుంబాలే..
500 మందికి నెరవేరని ప్రభుత్వ ఉద్యోగం హామీ
ఆందోళనలో బాధిత రైతు కుటుంబాలు
చండీగడ్ : భూమినే నమ్ముకుని ఆరుగాలం కష్టించి దేశ ప్రజలకు ఆహార ధాన్యాలు అందిస్తోన్న అన్నదాతల కష్టం తీర్చేది ఎప్పుడు..? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక మూడు కొత్త సాగు చట్టాలను నిరసిస్తూ ఏడాది కాలానికి పైగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తూ వచ్చారు. దేశవ్యాప్త ఉద్యమ క్రమంలో సుమారు 700 మందికి పైగా రైతులు అమరులయ్యారు. వీరిలో ఒక్క పంజాబ్ రైతులే 500 మందికి పైగా ఉన్నారు. అయితే వ్యవసాయ కొత్త చట్టాలను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించినప్పటికీ, దేశ శ్రేయస్సు కోసం ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన రైతు కుటుంబాలకు పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. వారికి ఆర్థిక భద్రత కూడా చేకూరలేదు. ఉద్యోగాలను మంజూరు చేసే పంజాబ్ ప్రభుత్వానికి చెందిన రెవెన్యూ విభాగం నుంచి పొందిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు సుమారు 250 మంది రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నియామక లేఖలను అందించింది. ఈ సంఖ్యను పంజాబ్ రాష్ట్ర రెవెన్యూ, పునరావాస విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి`ఆర్థిక కమిషనర్ వీకే జుంజువా ధ్రువీకరిస్తూ, జిల్లా స్థాయిలో డిప్యూటీ కమిషనర్ల సిఫార్సు మేరకు ఈ నియామక పత్రాలను ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఇంకా అనేక బాధిత రైతు కుటుంబాలు వేచి చూస్తున్నాయని రైతు సంఘాల సమాఖ్య సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తెలిపింది. మిగిలిన కేసులలో డిప్యూటీ కమిషనర్ స్థాయిలో పరిశీలన ప్రక్రియను కొనసాగించాలని జుంజువా అన్నారు. ‘డీసీలు ధ్రువీకరించిన కేసులు మా వద్దకు చేరినప్పుడు, మేము నియమాక లేఖలు జారీ చేస్తాం’ అని ఆయన తెలిపారు. విద్యార్హత ఆధారంగా ఉద్యోగాలు ఇస్తున్నారు. అభ్యర్థి గ్రాడ్యుయేట్ అయితే, వారికి గ్రూప్ సి క్లరికల్ పోస్టు ఇస్తారు. అభ్యర్థి 12వ తరగతి ఉత్తీర్ణులు కాకపోతే, గ్రూప్ డి పోస్టు ఇస్తారు. ఎస్కేఎం వివరాల ప్రకారం, పంజాబ్ నుంచి ఉద్యమంలో పాల్గొన్న వారిలో సుమారు 550 మంది రైతులు మరణించారు. అంటే పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్ధానం చేసిన విధంగా 300 బాధిత రైతు కుటుంబాల వారు ఉన్నారు. వారికి ఇంకా ప్రభుత్వ ఉద్యోగం, ఆర్థిక సాయం కల్పించలేదు. నిరసన సమయంలో మరణించిన రైతుల సగటు భూమి మూడు ఎకరాల కంటే తక్కువగా ఉందని, అంటే వారంతా పేద కుటుంబాలకు చెందినవారని, కుటుంబ యజమాని మరణించిన తర్వాత వారికి తక్కువ వనరులు ఉన్నాయని ఇటీవల ప్రచురితమైన ఒక నివేదికలోని అంశాలు దీని ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నాయి.