రాజస్థాన్ మంత్రి రామ్ లాల్ జట్
యువత భవిష్యత్తు గురించి ఆలోచించాలని కేంద్రానికి సూచన
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా రాజస్థాన్ రెవెన్యూ మంత్రి రామ్ లాల్ జట్ వ్యాఖ్యలు చేశారు. త్రివిధ దళాల్లో నాలుగేళ్ల పాటు సేవలు అందించే అగ్నివీర్ సర్వీసును కొత్తగా తీసుకురావడం తెలిసిందే. సైన్యంలో యువతరాన్ని పెంచి, శక్తి సామర్థ్యాలను బలోపేతం చేయడమే ‘అగ్నిపథ్’ లక్ష్యమని రక్షణ శాఖ స్పష్టంగా పేర్కొంది. దీనిపై రాజస్థాన్ మంత్రి రామ్ లాల్ జట్ స్పందిస్తూ.. అగ్నిపథ్ పథకం దేశాన్ని సుశిక్షిత ఉగ్రవాదం దిశగా నడిపిస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏడాది పాటు పని చేసినా పెన్షన్ ఇస్తున్నారు. అటువంటప్పుడు అగ్నివీర్లకు పెన్షన్ ఎందుకు ఇవ్వకూడదు? అగ్నిపథ్ పథకం కింద మూడు నాలుగేళ్ల పాటు సేవలు అందించిన తర్వాత నిరుద్యోగులుగా మారడం పట్ల, యువత తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతోంది’’ అని అన్నారు. యువత భవిష్యత్తు గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు.