Friday, April 19, 2024
Friday, April 19, 2024

‘అక్రమ’ ఇసుక మైనింగ్‌ దర్యాప్తు

పంజాబ్‌లో ఈడీ సోదాలు
సీఎం చన్నీ బంధువు సహా 12 ప్రాంతాల్లో తనిఖీలు

న్యూదిల్లీ/చండీగఢ్‌ : పంజాబ్‌లోని అనేక ప్రాంతాలలో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మంగళవారం సోదాలు నిర్వహించింది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ బంధువు నివాసంలో కూడా తనిఖీలు జరిపింది. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ‘ఇసుక మాఫియా’, సరిహద్దు రాష్ట్రంలో ఇసుక అక్రమ మైనింగ్‌తో సంబంధం ఉన్న కంపెనీలపై మనీలాండరింగ్‌ విచారణలో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) నిబంధనల కింద సీఎం చన్నీ బంధువు భూపిందర్‌ సింగ్‌ హనీ నివాసంతోపాటు మొహాలీ, లూథియానా, పఠాన్‌కోట్‌, చండీగఢ్‌ సహా రాష్ట్రంలోని కనీసం డజనుకు పైగా ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నట్లు వివరించారు. ఇందుకోసం కేంద్ర సాయుధ పోలీసు దళం(సీఆర్‌పీఎఫ్‌) సాయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చన్నీ మరదలి కుమారుడైన భూపిందర్‌ సింగ్‌ హనీ… పంజాబ్‌ రియల్టర్స్‌ పేరుతో ఒక సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కోట్ల కొద్దీ నల్లధనాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే భూపిందర్‌ నివాసంతోపాటు కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఎన్నికల వేళ ఒత్తిడి తెచ్చేందుకే.. : సీఎం చన్నీ
ఈడీ సోదాలపై స్పందించిన ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంధువుల ఇళ్లపై కూడా దాడులు చేశారని, పంజాబ్‌లోనూ ఈడీ తనపై, తన మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ సభ్యులపై ‘ఒత్తిడి’ చేయడానికి ‘అదే పద్ధతి’ అనుసరిస్తోందని అన్నారు. ‘మంత్రులు, ముఖ్యమంత్రిపైనే కాదు. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్తపై ఒత్తిడి ఏర్పడుతోంది. ఇలాంటి వాతావరణం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈడీ దాడులు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ వారు చేసే ఒత్తిడిని, అన్ని ఇబ్బందులను భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తాం. వారు విజయం సాధించలేరు’ అని చన్నీ అన్నారు. ఎన్ని ప్రదేశాలలో దాడులు జరిగాయి అని అడిగినప్పుడు, ‘నేను ఇప్పటివరకు టీవీ (ఛానెల్స్‌), మీడియా ద్వారా విన్నాను. నా దగ్గర కచ్చితమైన సమాచారం లేదు. 2018 ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా మీరు చెబుతున్నట్లుగా, దానితో నాకు సంబంధం ఏమిటి. 2018లో నేను ముఖ్యమంత్రిని కాను. కానీ అంతిమంగా, ఇది నన్ను, నా మంత్రులను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం. అయితే పంజాబీలు ఎప్పుడూ ఒత్తిడికి గురికారని చెప్పాలనుకుంటున్నాను’ అని తెలిపారు. ఇదిలాఉండగా, కుద్రత్‌దీప్‌ సింగ్‌ అనే వ్యక్తితో సీఎం చన్నీ బంధువు హనీకి ఉన్న సంబంధాలపై ఏజెన్సీ దర్యాప్తు చేస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. నవాన్‌షహర్‌ (షహీద్‌ భగత్‌ సింగ్‌ నగర్‌ జిల్లా) పోలీసుల 2018లో ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాత రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాల వ్యాపారంలో పాలుపంచుకున్నట్లు కొన్ని కంపెనీలు, వ్యక్తులపై కొన్ని ఫిర్యాదులు పోలీసులకు అందిన తర్వాత ఈడీ చర్య ప్రారంభించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఇసుక వెలికితీత, రవాణాలో పాల్గొన్న అనేక మంది ట్రక్కు డ్రైవర్లు, ఇతరులను నిందితులుగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img