Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

అఖిలేశ్‌ యాదవ్‌పై పోస్ట్‌…మార్క్‌ జుకర్‌బర్గ్‌పై కేసు

లక్నో : ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌పై వివాదాస్పద పేజీని ఫేస్‌బుక్‌లో నిర్వహిస్తుండటంతో ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సహా మరికొందరిపై కేసు నమోదైంది. అఖిలేశ్‌పై మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఎటువంటి పోస్ట్‌ పెట్టలేదు. కానీ ఫేస్‌బుక్‌ వేదికను దీనికోసం వినియోగించినందుకు ఆయనను ఈ కేసులో చేర్చారు. ఉత్తర ప్రదేశ్‌లోని కనౌజ్‌ జిల్లా సరహటి గ్రామస్థుడు అమిత్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అఖిలేశ్‌ యాదవ్‌ను కించపరుస్తూ, అవమానకరంగా ఓ ఫేస్‌బుక్‌ పేజ్‌ను నిర్వహిస్తున్నారని అమిత్‌ ఆరోపించారు. అఖిలేశ్‌ను అవమానిస్తూ ‘బువా బబువా’ పేరుతో పేజ్‌ను నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. మార్క్‌ జుకర్‌బర్గ్‌తోపాటు మరో 49 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. అమిత్‌ కుమార్‌ మే 25న పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అనంతరం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అమిత్‌ ఆరోపణలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ధరంవీర్‌ సింగ్‌ పోలీసులను ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేరును వదిలిపెట్టినట్లు తెలిపారు. ఫేస్‌బుక్‌ పేజ్‌ అడ్మినిస్ట్రేటర్‌పై దర్యాప్తు జరుగుతోందన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ ఫేస్‌బుక్‌ పేజీని క్రియేట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img